calender_icon.png 20 November, 2024 | 8:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సంకీర్ణ పాలన కత్తిమీది సామే!

27-06-2024 12:00:00 AM

జూకంటి జగన్నాథం

దేశంలో మొట్టమొదటిసారి 1975 అత్యవసర పరిస్థితి(ఎమర్జెన్సీ) అనంతరం 1977లో జరిగిన ఎన్నికలలో జనతా పార్టీ ఇందిరాగాంధీని ఓడించి కాంగ్రెసేతర భావజాల పార్టీలన్నిటిని కలుపుకొని తొలి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ ప్రభుత్వం రెండు సంవత్సరాలు(1977--79)కొనసాగిన  అనంతరం మొరార్జీ దేశాయ్, చరణ్ సింగ్‌లు రెండు గ్రూపులుగా విడిపోవడం వల్ల ప్రభుత్వం  కుప్ప కూలిపోయింది. అనంతరం 1980 లో జరిగిన ఎన్నికల్లో తిరిగి కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి  ఇందిరాగాంధీ నాలు గో  పర్యాయం ప్రధానమంత్రిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. 1984 అక్టోబర్ 31న ఇందిరాగాంధీని స్వంత అంగరక్షకులు హత్య చేశారు.

అనంతరం జరిగిన ఎన్నికల్లో ఆమె కుమారుడు రాజీవ్ గాంధీ భారీ మెజారిటీతో ప్రధాని పదవిని చేపట్టారు. అయితే 1989 లోక్‌సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా రాజీవ్ గాంధీ హత్యకు గురయ్యారు. ఆ ఎన్నికల తర్వాత తిరిగి 1989లో నేషనల్ ఫ్రంట్ ఆధ్వర్యంలో ఏర్పడిన ప్రభుత్వానికి వీపీ సింగ్  ప్రధానమంత్రిగా వ్యవహరించారు. ఈ ప్రభుత్వం తో విభేదించి 1990లో  చంద్రశేఖర్ సమాజ్ వాది పార్టీ సారథ్యంలో ప్రధానమంత్రిగా పనిచేశారు.ఆ ప్రభుత్వం కూడా ఎక్కువ కాలం కొనసాగలేదు. తర్వాత పీవీ నరసింహారావు ప్రధానిగా అయిదేళ్ల పాటు కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగింది. అనంతరం రెండేళ్ల వ్యవధిలో మూడు సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడినా ఏదీ ఎక్కువ రోజులు  కొనసాగలేదు. తొలుత 1996లో అటల్ బిహారీ వాజపేయి నేతృత్వంలో ఏర్పడిన సంకీర్ణ ప్రభుత్వం 13 రోజులు మాత్రమే కొనసాగింది. అనంతరం హెచ్‌డీ దేవెగౌడ,  ఐకే గుజ్రాల్ నేతృత్వంలో ఏర్పడిన యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వాలు కూడా ఏడాది కాలం కన్నా ఎక్కువ సాగలేదు. 

1999లో జరిగిన పార్లమెంటరీ సభ్యు ల ఎన్నికలలో  వాజపేయి నేతృత్వంలో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ఏర్పడి 2004 వరకు ప్రభుత్వాన్ని కొనసాగించా రు. 2004 నుండి 2014 వరకు యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్(యూపీఏ) కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పడి మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా 2 పర్యాయా ల కాలాన్ని పూర్తి  చేసుకున్నారు. దీని తర్వాత 2014లో నుండి 2024 వరకు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నేషనల్ డెమోక్రటిక్ ఆలయన్స్ (ఎన్డీఏ) ఏర్పడి పది సంవత్సరాలు నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఎదురులేకుండా తిరుగులే కుండా కొనసాగారు. మళ్లీ 2024లో జరిగిన ఎన్నికల్లో ఏ పార్టీకీ ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ రాకపోవడంతో  ఎన్డీఏ ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ సారథ్యంలో తిరిగి సంకీర్ణ ప్రభుత్వా న్ని ఏర్పాటు చేశారు.

చంద్రబాబు, నితీశ్‌ల కీలక పాత్ర

కాంగ్రెస్ మద్దతుతో యునైటె డ్ ఫ్రంట్ ప్రభుత్వాలు ఏర్పాటు చేసినప్పుడు ఉమ్మ డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక భూమిక పోషించారు. అయితే ఈ ఎన్నికల్లో కూడా చంద్రబాబు నాయుడు, బీహార్ నుంచి నితీష్ కుమార్ ఎన్డీఏ ప్రభుత్వంలో ప్రధా న పాత్ర వహించారు. కానీ వీరి వీరి అవసరాల దృష్ట్యా నిశ్శబ్దంగా కేంద్ర ప్రభు త్వంలో కొనసాగుతున్నారు. గతంలో కింగ్ మేకర్‌గా వ్యవహరించిన చంద్రబాబు నాయుడు, మిగతా ప్రాంతీయ భాగస్వా మ్య పక్షాలు ఇప్పుడు ప్రభుత్వ వాహనాని కి షాక్ అబ్జర్వర్‌గా మాత్రమే కొనసాగుతున్నారు. 10 సంవత్సరాలు నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా సాగిన కాలాన్ని పరిశీలిస్తే ప్రాంతీయ పార్టీలను  చీల్చి ఆయా పార్టీల ప్రాబల్యాన్ని సమర్థవంతంగా తగ్గించారు.

పార్టీల కూటమితో సంకీర్ణం

ఎన్నికలు జరిగినప్పుడు ఏ ఒక్క పార్టీకి కూడా సంపూర్ణ మెజార్టీ రానప్పుడు అంతకుముందే ఏర్పరచుకున్న రాజకీయ పార్టీ  కూటమి సహకారంతో సంకీర్ణ ప్రభుత్వాలను  ఏర్పాటు చేయడం జరుగుతుంది. అయితే సంఖ్యాపరంగా సింహ భాగమైన పార్టీ  ముఖ్యమైన పదవులు తమవద్దనే ఉంచుకొంటాయి. అంతేగాక భాగస్వామ్య పక్షాలను గేమ్ బ్లేమ్ ప్రణాళికతో బలహీనపరిచే ప్రక్రియ అంతర్గతంగా, నిరంత రం కొనసాగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సంకీర్ణ ప్రభుత్వాలను భాగస్వామ్య కింగ్ మేకర్లు ఏదో ఒక నెపంతో నిర్వీర్య పరుస్తుంటారు.

ఇటువంటి అడ్డంకులను అధిగమించడానికి ముందుచూపు కలిగిన రాజకీయ నాయకులు ముందుగా మేల్కొని ఒక స్టీరింగ్ కమిటీ ఏర్పాటు చేసుకొని, ఫెయిర్ షేర్‌గా  కామన్ మిని మం ప్రోగ్రాం రూపొందించుకొని తమ కాలావధిలో ఆచరణలో పెడతారు. ఈసారి అటువంటి కామన్ మినిమం ప్రోగ్రాం కానీ స్టీరింగ్ కమిటీ గాని  ఏర్పా టు చేయకపోవడం అంటే ప్రధానమంత్రి వారి వారి అవసరాల మేరకు ప్రాంతీయ పార్టీలను కట్టడి చేస్తున్నారనిపిస్తోంది. ఆయా భాగస్వామ్య పార్టీల ఆకాంక్షలను చిత్తశుద్ధితో ఆచరణలో పెడితే ప్రభుత్వం సజావుగా కొనసాగుతుంది. ఒకవేళ ఎవరైనా ఉల్లంఘిస్తే సంకీర్ణంలోనుంచి తాము, తమ బలాన్ని, బలగాన్ని ఉపసంహరించుకుంటారు. ఈ ప్రభుత్వాలలో ద్వంద్వ ప్రమాణాలతో కూడిన రాజనీతి రీతి ప్రయోగాలు చాపకింది నీరులా నిశ్శబ్దంగా పని చేస్తుంటాయి.

స్పష్టమైన గీత

జాతీయ పార్టీలకు, ప్రాంతీయ పార్టీలకు మధ్య ఒక స్పష్టమైన రేఖ ఉంటుంది. జాతీయ పార్టీల లక్ష్యం, లక్షణాలు, ప్రయోజనాలు ఒకరకంగా ఉంటే ప్రాంతీయ పార్టీల గమ్యాలు, ప్రయోజనాలు వేరే రకంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఒక పరిమితమైన ప్రాంత ప్రజల ఆశయాలు, భాషా సంస్కృతుల ఆలోచనలకు అనుకూలంగా ప్రాంతీ య పార్టీలు పని చేయవలసి వస్తుంది. వీటి అస్తిత్వాలు, ఉనికి ఆయా ప్రాంతాల ప్రజలకు మేలు చేసేదానిపై ఆధారపడి ఉంటుంది. ప్రాంతీయ పార్టీలు మిగతా ప్రాంతాలకు విస్తరించాలని ప్రయత్నం చేసినప్పుడల్లా విఫలమవుతుంటాయి, లేదా చెప్పుకోదగ్గ స్థాయిలో విజయం పొందలేక పోతాయి.

ప్రధాన శాఖలు వాళ్లవద్దే..

అయితే  ఈ సంకీర్ణ ప్రభుత్వాలలో మెజార్టీ పార్లమెంట్ సభ్యులు కలిగిన జాతీ య పార్టీలు ముఖ్యమైన మంత్రిత్వ శాఖలను తమవద్దే పెట్టుకుంటాయి. మిగతా మంత్రిత్వ శాఖలను తన భాగస్వామ్య పక్షాలకు కేటాయిస్తాయి. అయితే జాతీయ స్థాయిలో ప్రాంతీయ పార్టీల ప్రాబల్యం, ప్రభావం కనబడుతుంది. తమ ప్రాంతం ప్రజల అవసరాలను తీర్చుకోవడానికి బేరసారాలు చేస్తాయి. ప్రభుత్వం ఏర్పాటు చేసిన జాతీయ పార్టీలు గంభీరంగా కనబడుతుంటాయి.

కింగ్ మేకర్ కావాలనుకు న్న ప్రాంతీయ పార్టీ నాయకుల క్రీడలకు కళ్లెం వేస్తుంటారు. ప్రాంతీయ పార్టీలను చీల్చాలని జాతీయ పార్టీలు అనుక్షణం అవకాశం కోసం గోతికాడి నక్కలా ఎదురుచూస్తుంటాయి. ప్రాంతీయ పార్టీ నాయ కులు రాజకీయ అనుభవ చాతుర్యంతో కేంద్ర ప్రభుత్వంతో వ్యవహరిస్తుంటాయి. పైకి ఎంతో అన్యోన్యంగా ఉన్నట్టే కనిపిస్తుంది. కానీ ఇది పిల్లికి దొరకకుండా ఎలు క, ఎలుక కంటపడకుండా పిల్లి అన్నట్లుగా  ఒకరిపై ఒకరు పరోక్షంగా ఆధిపత్యం సాధించడానికి దోబూచులాట కొనసాగుతుంటుంది. ఈ విషయంలో దేశంలో సంకీర్ణప్రభుత్వాల చరిత్రలోకి  వెళ్తే చాలా ఆసక్తికరమైన విషయాలు తెలుస్తాయి.

ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ కలిగిన మన దేశంలో సంకీర్ణ ప్రభుత్వాలలో అంతర్గత వైరుధ్యాలను ఎప్పటికప్పుడు సర్దుబాటు, రాజీ మార్గాల సమన్వయం చేసుకుంటూ ముందుకు పోవాలి. ఏది ఏమైనా సంకీర్ణ పాలనను సజావుగా కొనసాగించడం కత్తిమీద సాములా ఐదేళ్లు బండిని లాక్కు పోవాల్సి వస్తుంది.

వ్యాసకర్త కవి, రచయిత