calender_icon.png 2 April, 2025 | 2:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎం భాష తీరే ఆయన్ను బొందపెడతది

01-04-2025 02:50:38 AM

 మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి

సూర్యాపేట,మార్చి31(విజయక్రాంతి): రాష్ట్ర ముఖ్యమంత్రి తన హోదాను మరిచి సోయిలేకుండా దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారని, రేవంత్ భాషలో ఎలాంటి మార్పు రాలేదని,  భాష తీరే ఆయనను బొందపెడుతుందని మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. హుజూర్ నగర్ సభలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మండిపడ్డారు.

ముఖ్యమంత్రి స్థాయి వచ్చిన మూర్ఖత్వం మారడం లేదని, పచ్చి అబద్ధాలు, అవే అర్థం లేని ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. 15 నెలలు గడిచినా కేసీఆర్ మాట లేకుండా సభ సాగట్లేదని, సోనియా 6 గ్యారంటీలను నమ్మి ప్రజలు మోసపోయారు తప్ప రేవంత్ రెడ్డి మూర్ఖత్వపు మాటలకు కాదన్నారు.

కాళేశ్వరాన్ని కేసిఆర్ కు అప్పగిస్తే మూడు రోజుల్లో నీళ్లు ఇచ్చి చూపిస్తామని చెప్పిన ఎలాంటి స్పందన లేదన్నారు. మళ్లీ రైతులకు కష్టాలు మొదలయ్యాయని, పంట పొలాల వద్ద కన్నీరు పెడుతున్నరని, కడుపుమండిన రైతులు, మహిళలు ప్రభుత్వానికి, రేవంత్ కు శాపనార్ధాలు పెడుతున్నారని అన్నారు.

ప్రభుత్వం ఇస్తామన్న రుణమాఫీ,  రైతుబంధు, బీమా లేదని ప్రతిదీ మభ్యపెట్టి మోసం చేశారని తెలిపారు. బోనస్ ఇవ్వాల్సి వస్తుందని అసలు ధాన్యమే కొనడం లేదని ఆరోపించారు. ఉన్న ధాన్యం ఎంత అంటే ఎక్కడ సమాధానం లేదని,  ప్రతిపక్ష నాయకుల ఫోన్లను అధికారులు ఎత్తడమే లేదని తెలిపారు.

పక్క దేశాలను చూస్తే ప్రజలు తిరుగబడితే ఎలా కూలిపోయాయో తెలుస్తుందని, పద్ధతి భాష మార్చుకోవాలని,  రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు.