21-02-2025 10:44:52 PM
విశ్వ విద్యాలయాలకు పూర్తి స్వయం ప్రతిపత్తి కల్పించాలి..
ఉద్యోగుల టైం స్కేల్ న్యాయమైనదే ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తా..
ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ వి. బాలకిష్టారెడ్డి..
ముషీరాబాద్ (విజయక్రాంతి): యూనివర్సీటీ నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు టైమ్ స్కేల్ ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డికి విన్నవిస్తానని ఎమ్మెల్సీ ప్రొఫెసర్ ఎ. కోదండరాం హామీ ఇచ్చారు. ఈ మేరకు శుక్రవారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ రాష్ట్ర విశ్వవిద్యాలయాల నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ జేఏసీ ఆధ్వర్యంలో యూనివర్సీటీలలో పనిచేస్తున్న నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు టైం స్కేల్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సదస్సును నిర్వహించారు. ఈ సదస్సుకు ఎమ్మెల్సీ కోదండరాం, తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా కమిషన్ చైర్మన్ ప్రొఫెసర్ వి. బాలకిష్టారెడ్డి, వైస్ చైర్మన్ ప్రొఫెసర్ ఇటిక్యాల పురుషోత్తం, సభ్యులు చారగొండ వెంకటేశ్, సెంట్రల్ యూనివర్సీటీ రిటైర్డ్ ప్రొఫెసర్ జి. హరగోపాల్‌లు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ... గత కేసీఆర్ ప్రభుత్వం వర్సిటీలను పట్టించుకోలేదన్నారు.
ప్రస్తుతం పనిచేసే ప్రభుత్వం అధికారంలో ఉండడం వల్ల న్యాయం జరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కాంట్రాక్ట్ నాన్ టీచింగ్ ఉద్యోగులకు టైం స్కేల్ న్యాయమైన డిమాండ్ అని, దీని పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని అన్నారు. ఉద్యోగులు ఐక్యతను కాపాడుకుంటూ సామాజిక న్యాయంతో ముందుకు సాగాలని అన్నారు. ప్రొఫెసర్ జి. హరగోపాల్ మాట్లాడుతూ... విశ్వ విద్యాలయాలకు పూర్తి స్వయం ప్రతిపత్తి కల్పించాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి ఏపీలో గత చంద్రబాబు ప్రభుత్వం ఆదేశాలకు అనుగుణంగా కాంట్రాక్ట్ ఔట్‌సోర్సింగ్ వ్యవస్థను తీసుకువచ్చిందని, దీంతో విశ్వ విద్యాలయాలు స్వయం ప్రతిపత్తి కోల్పొయిందన్నారు. కార్పొరేటర్, ప్రైవేట్ ప్రభుత్వంపై పెత్తనం చెలాయిస్తున్నాయని అన్నారు. వచ్చే బడ్జెట్‌లో రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి 15 శాతం నిధులు కేటాయించాలని అన్నారు.
నాన్ టీచింగ్ కాంట్రక్ట్ ఉద్యోగులకు టైం స్కేల్ అమలు చేసి పూర్తి ఉద్యోగ భద్రత కల్పించాలని అన్నారు. సుప్రీం కోర్టు తీర్పుకు అనుగుణంగా సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని అన్నారు. తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ వి. బాలకిష్టారెడ్డి మాట్లాడుతూ... ఉద్యోగుల టైం స్కేల్ న్యాయమైందని, ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా చూస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జేఏసీ చైర్మన్ సూర్యచందర్, అధ్యక్షుడు కట్ట వెంకటేశ్, ప్రధాన కార్యదర్శిలు ఎస్. అరుణ్ కుమార్, టి. చేతన్, మన్మోహన్, కన్వీనర్ సి. శ్రీనివాస్, కే. శ్రీకాంత్, వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ విష్ణువర్ధన్ తదితరులు పాల్గొన్నారు.