calender_icon.png 4 October, 2024 | 2:57 AM

సుప్రీం తీర్పుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న సీఎం

04-10-2024 12:58:24 AM

ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ

హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 3 (విజయక్రాంతి): సీఎం రేవంత్‌రెడ్డి సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ అన్నారు. గురువారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వర్గీకరణ ఉద్యమంలో రేవంత్ పాల్గొన్నారని,  సీఎం అయ్యాక వర్గీకరణను అమలు చేస్తారనుకున్నామన్నారు. 

కానీ, ఆయనపై పెట్టుకున్న నమ్మకం వమ్మయిందని పేర్కొన్నారు. ఆగస్టు 1న సుప్రీంకోర్టు ఇచ్చిన ఎస్సీ వర్గీకరణ తీర్పును సీఎం రేవంత్‌రెడ్డి అందరికన్నా ముందు స్వాగతించారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం డీఎస్సీ ఫలితాలను విడుదల చేసిందని, ఈ నెల 9న నియా మక పత్రాలందిస్తామని సీఎం ప్రకటించారని చెప్పా రు.

అయితే, డీఎస్సీ ఫలితాల్లో ఎస్సీ వర్గీకరణను ఎందుకు అమలు చేయ డం లేదని ప్రశ్నించారు. వర్గీకరణ జరగబోతుంది.. తమకు న్యాయం జరుగుతుందని మాదిగ, మాదిగ ఉపకులాల అభ్యర్థులు ఎదురు చూస్తున్నారని, వర్గీకరణ వ్యతిరేక శక్తుల ఒత్తిడితో వర్గీకరణ చేయకుండానే ఉద్యోగాల భర్తీ చేయబోతున్నారని విమర్శించారు.

దీనికి నిరసనగా ఈ నెల 9న జిల్లా కేంద్రాల్లో నల్ల జెండాలు ఎగరేసి నిరసనలు తెలపాలని పిలుపునిచ్చారు. అసెంబ్లీలో ఇచ్చిన మాటకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. పంజాబ్, తమిళనాడు రాష్ట్రాలు ఎస్సీ వర్గీకరణను అమలు చేస్తున్నాయని తెలిపారు. తెలంగాణలో వర్గీకరణ అమలు జరగకుండానే ఉద్యోగాల భర్తీ, అడ్మిషన్ల భర్తీ జరుగుతోందన్నారు.

కానీ తెలంగాణలో కమిటీ వేసి అనంతరం అమలు చేస్తామని సీఎం చెప్పారన్నారు. అధిష్టానం ఒత్తిడి ఒకవైపు, రాష్ట్రంలోని మాలల ఒత్తిడి వల్ల వర్గీకరణ అమలులో వెనకడుగు వేస్తున్నారని ఆరోపించారు. సమావేశంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గోవింద్ నరేశ్‌మాదిగ, తదితరులు పాల్గొన్నారు.