- రైతు కన్నీరు పెడుతుంటే ప్రభుత్వం మొద్దునిద్ర!
- మాజీ మంత్రి హరీశ్‌రావు
- ఖమ్మం పత్తి మార్కెట్ సందర్శన
ఖమ్మం, నవంబర్ 22 (విజయక్రాంతి): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి మద్యం మీద ఉన్న ప్రేమ రైతులపైన లేదని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు మండిపడ్డారు. శుక్రవారం ఆయన మాజీ మంత్రులు పువ్వాడ అజయ్‌కుమార్, గంగుల కమలాకర్, ఎమ్మెల్సీ తాతా మధు, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యతో కలిసి ఖమ్మం పత్తి మార్కెట్‌ను సందర్శించారు.
రైతులతో మాట్లాడి, వారి ఇబ్బం దులను తెలుసుకున్నారు. అలాగే మధిర నియోజవర్గంలోని చింతకాని మండలంలో పర్యటించి, పలు రైతు కుటుంబాలను పరామర్శించి, భరోసా కల్పించారు.
అనంతరం మీడియాతో హరీశ్‌రావు మాట్లాడుతూ.. మద్యం అమ్మకాలు తక్కువ జరిగితే ఆఘమేఘాల మీద రివ్యూలు చేసి, తక్కువ అమ్మిన అధికారులకు మెమోలు జారీ చేసే ముఖ్యమంత్రి గిట్టుబాటు ధర రాక పంటను తెగనమ్ముకుంటూ రైతులు నష్టపోతున్నా ఎందుకు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ప్రశ్నించారు.
తెలంగాణాను తాగు బోతుల తెలంగాణాగా మార్చిన రేవంత్‌రెడ్డికి రైతులే బుద్ధి చెపుతారని అన్నారు. మద్దతు ధర రాక పత్తి రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే ప్రభుత్వం మొద్దు నిద్ర పోతుందని ధ్వజమెత్తారు. ప్రతిపక్షాల మీద కుట్రలు చేయడం, ప్రతిపక్ష నేతలను అరెస్ట్ చేయడం, అక్రమ కేసులతో వేధించడం తప్ప రైతులకు సాయం చేయడానికి ప్రభుత్వానికి మనుసు రావడం లేదన్నారు.
తేమ శాతం పేరుతో వ్యాపారులు కొర్రీలు పెడుతూ రైతులను ఇబ్బంది పెడుతున్నారని అన్నారు. కాగా ఫార్మా కంపెనీ పేరుతో లగచర్లలో గిరిజన రైతుల భూములను లాక్కోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని హరీశ్‌రావు చెప్పారు.
పత్తంతా దళారులపాలే..
వరంగల్ డిక్లరేషన్‌లో అన్ని పంటలకు బోనస్ అన్నారని, ఇప్పుడు కేవంల సన్నాలకు మాత్రమే ఇస్తామంటున్నారని మండిపడ్టారు. ఖమ్మం మార్కెట్‌కలో ఏ ఒక్కరోజు కూడా పత్తికి మద్దతు ధర రాలేదన్నారు. క్వింటాకు రూ.1,500 రైతులు నష్టపోతున్నారనానరు. ఖమ్మం మార్కెట్‌లో పత్తి క్వింటాలు రూ.6,500 ధర కూడా దాటటం లేదన్నారు. రూ.7,521 మద్దతు ధరఎందుకు ఇవ్వడం లేదన్నారు.
రాష్ట్రంలో 25 లక్షల మెట్రిక్ టన్నులు కొంటామన్న ప్రభుత్వం ఇప్పటి వరకు లక్షా 20 వేల మెట్రిక్ టన్నులు కూడా కొనలేదన్నారు. జిల్లాలోని సీసీఐ కేంద్రాల్లో 7 వేల మెట్రిక్ టన్నులు కొంటే, ప్రైవేట్ వ్యాపారులు 15 వేల మెట్రిక్ టన్నులు కొన్నారని అన్నారు. వ్యాపారుల వద్దనే సీసీఐ కొంటుందని, రైతుల వద్ద కొనడం లేదన్నారు.
జిల్లా మంత్రులు బిజీ!
ఒకరిపై ఒకరు పైచేయి సాధించడం కోసం ఖమ్మం జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు చాలా బీజీగా ఉన్నారని, ప్రజల సమస్యలను మాత్రం గాలికి వదిలేశారని హరీశ్‌రావు విమర్శించారు. మార్కెట్‌లో రైతు పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే మంత్రుల్లో ఎందుకు చలనం రావడం లేదని అన్నారు. మద్దతు ధర లభించక పత్తి రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే జిల్లాకు చెందిన మంత్రులు ఏం చేస్తున్నారని నిలదీశారు. మార్కెట్‌లో సీసీఐ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
వరి ధాన్యానికి బోనస్ భోగస్
సన్న వడ్లకు రూ.500 బోనస్ ఇస్తామని ప్రభుత్వం చేసిన ప్రకటన భోగస్‌గా మారిందని హరీశ్‌రావు విమర్శించారు. ఖమ్మం జిల్లాలో 4 లక్షల మెట్రిక్ టన్నుల సన్న రకం వడ్లు పండాయని, ఇప్పటి వరకు కొన్నది కేవలం 19వేల మెట్రిక్ టన్నులు మాత్రమేనని అన్నారు.
ఒక్క రైతుకు కూడా బోనస్ రాలేదన్నారు. అయితే మధ్య దళారులు మాత్రం 2 లక్షలు మెట్రిల్ టన్నులు కొన్నట్లు తెలిసిందని అన్నారు. సన్నాల్లో రకరకాల కొర్రీలు పెట్టి వేధిస్తుంటే రైతులు ప్రైవేట్‌లో అమ్ముకుంటున్నారని అన్నారు
రేవంత్‌ను వదిలే ప్రసక్తే లేదు
ఆరు గ్యారంటీలు అమలు చేసేదాకా కాంగ్రెస్ ప్రభుత్వం వెంటప డతామని, సీఎం రేవంత్‌ను వదిలే ప్రసక్తేలేదని హరీశ్‌రావు మండిపడ్డారు. పంద్రాగస్టులోపు రుణమాఫీ చేస్తానని సీఎం రేవంత్ దేవుళ్ల మీద ఒట్టు పెట్టి మోసం చేశాడన్నారు. రేవంత్ సర్కార్‌కు బీఆర్‌ఎస్‌ను ఎదు ర్కునే దమ్ము లేక తమ పార్టీ నాయకులపై అక్రమ కేసులు బనాయిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని ధ్వజమెత్తారు.
మూసీ కంటే రేవంత్ నోటి కంపే ఎక్కువ అన్నారు. కాగా అదాని, రేవంత్ మధ్య ఉన్న సంబంధంపై సమగ్ర విచారణ జరపాలని కోరారు. చింతకాని మండలానికి చెందిన ప్రభాకర్ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరినందుకు బీఆర్‌ఎస్ మండ లాధ్యక్షుడు పుల్లయ్యపై కేసు పెట్టారని ఆరోపించారకు.
ప్రభాకర్‌ది కాంగ్రెస్ చేసిన హత్యేనని ఆరోపించారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీ చైర్మన్ లింగాల కమలరాజు, మాజీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, కొండ బాల కోటేశ్వరరావు పాల్గొన్నారు
సర్వేతో ప్రజల గోప్యతకు భంగం
హైదరాబాద్, నవంబర్ 22 (విజయక్రాంతి): ప్రభుత్వం చేపట్టిన కుటుంబ సర్వే పత్రాలు రోడ్డుపై కుప్పలుగా పడటం ప్రభుత్వ నిరక్ష్యానికి నిదర్శనమని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. గతంలో ప్రజాపాలన దరఖాస్తులు రోడ్డుపై పడవేశారని గుర్తు చేశారు.
ప్రజల వివరాల సేకరణ పట్ల రేవంత్ సర్కార్‌కు ఉన్న చిత్తశుద్ధికి ఇది మరో నిదర్శమన్నారు. సైబర్ నేరగాళ్లకు వివరాలు చిక్కితే ప్రజల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. ప్రజల గోప్యతా హక్కులను భంగం కలిగించేలా ప్రభుత్వ వైఖరి ఉందన్నారు. ఈ ఘటనపై ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు.