మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు డాక్టర్ వి ఎల్ రాజు..
ముషీరాబాద్ (విజయక్రాంతి): ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ అంశంపై జస్టిస్ షమీర్ అక్తర్ కమిషన్ నివేదికను నేడు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ రేవంత్ రెడ్డి కేబినెట్ ఆమోదించి మాల ఉప కులాలకు తీరని ద్రోహం, వెన్నుపోటు పొడిచారాని మాల మహానాడు జాతీయ అధ్యక్షులు డాక్టర్ వి.ఎల్.రాజు ఆరోపించారు. నివేదనలో మాదిగ కులాలకు 9 శాతం మాల కులాలకు 5 శాతం, ఎస్సీ సంచార కులాలకు 1 శాతం రిజర్వేషన్ లు కేటాయిస్తూ పూర్తిగా మాదిగలకు అధికంగా అవకాశం కల్పించి, మాలలకు అన్యాయం చేశారని మండిపడ్డారు. ఈ మేరకు మంగళవారం హిమాయత్ నగర్ లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాలల భవిష్యత్ ను దెబ్బ తీశారని ఆందోళన వ్యక్తం చేశారు.
నివేదిక శాస్త్రీయంగా జరగలేదని, అది పూర్తిగా కాంగ్రెస్, బీజేపీ, ఎమ్మార్పీఎస్ లతో రాజకీయంగా కుమ్మక్కై మాదిగలకు పక్షపాతం చూపారని విమర్శించారు. జాతికి వెన్నుపోటు పొడిచిన మంత్రులు, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, స్పీకర్, ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, వినోద్ తదితరులు నమ్ముకున్న మాలలకు ద్రోహం చేసి సీఎం రేవంత్ రెడ్డికి పాలేర్లుగా మారారని విమర్శించారు. ఈ నివేదికపై కోర్టులో సవాల్ చేస్తామని ప్రకటించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టడానికి మాలలు సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు జె.ఎన్.రావు, ప్రధాన కార్యదర్శి నక్క దేవేందర్ రావు, దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి కృష్ణ స్వరూప్ తదితరులు పాల్గొన్నారు.