calender_icon.png 16 November, 2024 | 4:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముగింపు వేడుకలు అదుర్స్

13-08-2024 12:00:00 AM

  1. పతాకధారులుగా మనూ, శ్రీజేశ్
  2. ప్రత్యేక ఆకర్షణగా హీరో టామ్ క్రూజ్

ప్రపంచాన్ని మొత్తం ఒక చోటకు చేర్చి 17 రోజుల పాటు క్రీడాభిమానులను అలరించిన పారిస్ ఒలింపిక్స్ క్రీడలు ఆదివారం ఘనంగా ముగిశాయి. ముగింపు వేడుకలకు ఫ్రాన్స్‌లోని ప్రఖ్యాత స్టేడ్ డి ఫ్రాన్స్ స్టేడియం ఆతిథ్యమిచ్చిన వేళ.. మిరుమిట్లు గొలిపే లైట్లు.. బాణాసంచా వెలుగులతో స్టేడియం కాంతులమయంగా మారిపోయింది. ఆయా దేశాల అథ్లెట్లు జాతీయ జెండాతో పరేడ్ నిర్వహించగా.. ఈవెంట్‌కు హాజరైన హాలీవుడ్ యాక్షన్ హీరో టామ్ క్రూజ్ తన విన్యాసాలతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. 2028 ఒలింపిక్స్‌కు ప్రాతినిధ్యం వహించనున్న లాస్ ఏంజిల్స్‌కు బ్యాటన్ అందించడం ద్వారా పారిస్ క్రీడలకు తెరపడినట్లయింది. గుడ్ బై పారిస్.. మళ్లీ లాస్ ఏంజిల్స్‌లో కలుద్దాం..!

పారిస్: విశ్వక్రీడల సంబరం ఘనంగా ముగిసింది. ప్రపంచంలోనే అత్యున్నత క్రీడగా అభివర్ణించే ఒలింపిక్స్‌కు ఈసారి పారిస్ ఆతిథ్యమివ్వగా.. 17 రోజుల పాటు విశేషంగా అలరించిన విశ్వక్రీడలు ఆదివారం నిర్వహించిన ముగింపు వేడుకలతో సమాప్తమయ్యాయి. ఆరంభ వేడుకలకు సీన్ నది వేదికగా నిలవగా.. ప్రఖ్యాత స్టేడ్ డి ఫ్రాన్స్ స్టేడియంలో ముగింపు వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. నృత్యకారులు, సంగీత కళాకారులు తమ ప్రదర్శనతో ప్రేక్షకులను పరశివంపజేశారు.

భారత్ తరఫున షూటర్ మనూ బాకర్, హాకీ దిగ్గజం పీఆర్ శ్రీజేష్ పతాకధారులుగా వ్యవహరించారు. ప్రేక్షకులతో స్టాండ్స్ అన్ని కిక్కిరిసిపోగా.. అశేష జన వాహినికి అభివాదం తెలుపుతూ ఆటగాళ్లు వీడ్కోలు పలికారు. ఒలింపిక్ టార్చ్‌ను ఆర్పేసి బ్యాటన్‌ను తర్వాత జరగనున్న లాస్ ఏంజిల్స్ ప్రతినిధులకు అందించారు. 2028 ఒలింపిక్స్‌కు లాస్ ఏంజిల్స్ ఆతిథ్యమివ్వనుంది. కాగా ముగింపు వేడుకల్లో హాలీవుడ్ యాక్షన్ హీరో టామ్ క్రూజ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. తన విన్యాసాలతో అలరిం చిన టామ్ క్రూజ్ ప్రేక్షకుల మధ్యలో నుంచి బైక్ నడుపుకుంటూ వచ్చిఒలింపిక్స్ జెండా ను చేబూని వేదికపైకి చేరుకున్నాడు. 

భారత్‌కు 71వ స్థానం

పారిస్ ఒలింపిక్స్‌లో పతకాల వేటలో అమెరికా మరోసారి ఆధిపత్యం ప్రదర్శించిం ది. ఈ ఒలింపిక్స్‌లో అమెరికా 40 స్వర్ణాలతో మొత్తంగా 126 పతకాలు సాధించి అగ్రస్థానంలో నిలవగా.. 40 స్వర్ణాలు దక్కించుకున్న చైనా 91 పతకాలతో రెండో స్థానంలో ఉంది. ఇక జపాన్ (20 స్వర్ణాలు) మూడో స్థానంలో నిలవగా.. ఆతిధ్య ఫ్రాన్స్ 16 స్వర్ణాలతో మొత్తంగా 66 పతకాలతో ఐదో స్థానంలో నిలిచింది. గత టోక్యో ఒలింపిక్స్‌లో ఏడు పతకాలతో 48వ స్థానంలో నిలిచిన భారత్ ఈసారి మాత్రం ఆరు పతకాలతో 71వ స్థానానికి పరిమితమైంది.