ఆదిలాబాద్ (విజయక్రాంతి): ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని సివిల్ సప్లయి గోడౌన్ ఎదుట ఏఐటీయూసీ అనుబంధం తెలంగాణ సివిల్ సప్లయి హమాలీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర సమితి పిలుపు మేరకు కార్మికులు నిరవధిక సమ్మె చేపట్టారు. బుధవారం సమ్మె శిబిరాన్ని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి విలాస్, జిల్లా కార్యదర్శి సిర్ర దేవేందర్ సందర్శించి కార్మికులకు పూల మాలలు వేసి సమ్మెను ప్రారంభించారు. ఈ సందర్భంగా విలాస్ మాట్లాడుతూ.. గతంలో సివిల్ సప్లయి హమాలీలతో రాష్ట్ర కమిషనర్ ఒప్పుకున్నా కూలీ రేట్ల ఒప్పంద జి.ఓ ను వెంటనే అమలు చేసి ఏరియర్స్ తో కలిపి ఇవ్వాలన్నారు. అలాగే హమాలీ కార్మికులకు, స్వీపర్లకు 10 లక్షల ఆరోగ్య భీమా సౌకర్యం కల్పించాలన్నారు. లేని పక్షంలో కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించేంత వరకు సమ్మె కొనసాగుతుందని తెలియచేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా డిప్యుటీ ప్రధాన కార్యదర్శి గాజంగుల రాజు, హమాలీ కార్మికులు పాల్గొన్నారు.