calender_icon.png 4 February, 2025 | 6:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డప్పు చప్పుళ్లతో నగరం దద్దరిల్లాలి!

04-02-2025 12:00:00 AM

మన కళ్ళ ముందు జరిగిన గొప్ప మానవ హక్కుల ఉద్యమం ‘మాదిగ దండోరా’. ఎంఆర్‌పీఎస్ పోరాట దీక్ష అందరికీ తెలిసిందే. ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో 1994లో మంద కృష్ణమాదిగ నేతృత్వంలో మొదలై, నేడు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకూ విస్తరించింది. గత మూడు దశా బ్దాలపాటు సుదీర్ఘ కాలంగా, అన్ని వర్గాల మద్దతునూ కూడగట్టుకుంది.

రిజర్వేషన్లలో సమాన హక్కులు, సా మాజిక న్యాయం, ఆత్మగౌరవాల కోసం సాగుతున్న పోరాటమే ఈ ఉ ద్యమం. ఎస్సీలలో ని ఒక కులం మాత్ర మే వారి జనాభాకు మించి అభివృద్ధి చెందుతున్నది. ఇది డా.బి.ఆర్ అంబేద్కర్ సామాజిక న్యాయసూత్రానికి పూర్తి విరుద్ధం. జనాభా దామాషా ప్రకారం అవకాశాల ఫలాలు అందరికీ అందాలనే లక్ష్యంతో మొదలైన సుదీర్ఘ ఉద్యమం నేడు చివరి దశకు చేరుకుంది. 

ఈ ఉద్యమ లక్ష్యం నెరవేరాలని ఆశగా ఎదురు చూస్తున్న వారెందరో. భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఏడుగురు న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. దేశ చరిత్రలో ఇది చారిత్రాత్మకం.

ఈ నేపథ్యంలో రిజర్వేషన్ల వర్గీకరణ ముఖ్యోద్దేశం ఇప్పటి వరకు రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లు చట్టబద్ధంగా పొందవలసిన విద్య, ఉద్యోగ అవకాశాలు పొందలేనటువంటి కులాలకు అందించాలనేది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అసెంబ్లీ వేదికగా ‘ఎస్సీ వర్గీకరణ అమలుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, దేశంలో తెలంగాణలోనే మొట్టమొదట అమలు చేస్తామని’ ప్రకటించారు.

దానికి అనుగుణంగానే రాష్ట్రమంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు. ఈ ఉపసంఘం సిఫారసుల మేరకు రిటైర్డ్ హైకోర్టు జడ్జి డా. షమీమ్ అక్తర్ నేతృత్వంలో ‘ఏకసభ్య కమిషన్’ ఏర్పాటైంది. ఈ మేరకు తెలంగాణ వ్యాప్తంగా వివిధ సామాజిక వర్గాల అభిప్రాయ సేకరణ కూడా జరిగింది. త్వరలో ‘ఏకసభ్య కమిషన్’ తన నివేదికను ప్రభుత్వానికి ఇవ్వనున్నట్టు తెలుస్తున్నది. 

ఒక్కటి కావలసిన తరుణమిదే!

మూడు దశాబ్దాల మాదిగ, మాదిగ ఉపకులాల ఆకాంక్ష నెరవేరబోతున్న వేళ ఇది. గడచిన 75 ఏళ్లలో జరిగిన అన్యాయానికి ఎస్సీలలో అసమానతలకు ముగింపు పలకడం కోసం సబ్బండ వర్గాల మద్దతుని మరొకసారి కూడాగట్టే ప్రయత్నంగా 7వ తేదీన మన కళాకారుల మహా ప్రదర్శనకు మందకృష్ణ మాదిగ పిలుపునిచ్చారు.

ఆయన నాయకత్వంలో కవులు, కళాకారులు, జర్నలిస్టులు, మేధావులు, విద్యార్థి సంఘాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ, ప్రజాస్వామిక aవాదులు, అన్ని వర్గాల కులసంఘాల నాయకులంతా కలిసి దీనిని జయప్రదం చేయవలసి ఉంది. ప్రజల మద్దతుతో హైదరాబాద్ నడిబొడ్డున ట్యాంక్‌బండ్ వేదికగా డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ విగ్రహం, సచివాలయం సాక్షిగా మనవైన వేల గొంతులు, లక్షల డప్పులతో సాంస్కృతిక ప్రదర్శన జరగనుంది.

ఈ 30 ఏళ్ల పోరాటంలో మందకృష్ణ మాదిగ అలుపెరగకుండా, ఎన్నో అవమానాలు, వెన్నుపోట్లు ఎదుర్కొంటూ,  ఎప్పటికప్పుడు కుట్రలు పసిగడుతూ, తన వ్యూహాలతో ఉద్యమాన్ని లక్ష్యానికి చేరువ చేశారు. ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ చివరి దశకి చేరిన ఈ సందర్భంలో మాదిగ విద్యార్థులుగా మనం ఒక్కసారి ఆత్మ విమర్శ చేసుకోవాలి.

ఎస్సీ వర్గీకరణ పోరాటం ఎవరికోసం ఎందుకోసం, ప్రయోజనం పొందేది ఎవరు, ఎవరు మన కోసం త్యాగాలు చేస్తున్నారు, ఈ పోరాటంలో మన పాత్ర ఏంది? వంటివన్నీ ఒక్కసారి పునః పరిశీలన చేసుకోవాలి.  మాదిగ విద్యార్థులుగా, ఏ సంఘంలో ఉన్నా, ఏ వాదంలో ఉన్న, ఏ పార్టీలో ఉన్నప్పటికీ మాదిగ జాతి బిడ్డలుగా మనమంతా ఒకటే అని ప్రపంచానికి చాటి చెప్పాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది.

మనకోసం మద్దతుగా నిలవడానికి అన్ని వర్గాల నాయకులు  ముందుకు వస్తున్నారు. ఎస్సీ వర్గీకరణ జరిగితే లబ్ధి పొందే మొదటి వ్యక్తులుగా మనం ఎంతో బాధ్యతగా ఎక్కడికక్కడ, ఎవరి స్థాయిలో వారు గ్రామాల నుంచి మొదలుకొని యూనివర్సిటీల వరకు సమాయత్తం కావాలి. 

ఈనెల 7న ‘వేల గొంతులు లక్షల డప్పులతో జరిగే మాదిగల సాంస్కృతిక మహా ప్రదర్శన’ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకుందాం. మన సమాజాన్ని కూడా సిద్ధం చేసి మాదిగల న్యాయమైన వాదాన్ని, సామాజిక నినాదాన్ని మరొక్కసారి ప్రపంచానికి చాటి చెప్పడంలో ముందువరసలో ఉందామని యావత్ తెలంగాణ మాదిగ విద్యార్థులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. కృష్ణ మాదిగ పిలుపు మేరకు ప్రతి మాదిగ విద్యార్థి డప్పు చప్పుళ్లతో లక్షలాదిగా కదిలి రావాలని కోరుతున్నాం.

 ఉస్మానియా యూనివర్సిటీ 

మాదిగ రీసెర్చ్ స్కాలర్స్, విద్యార్థులు 

(వలిగొండ నరసింహ, కొమ్ము శేఖర్ మాదిగ, జంగిలి దర్శన్,

కాంతి ప్రణయ్ కుమార్, పేర్ల బాలు, డి కృష్ణ, తీగల 

శివకుమార్, పల్లె అర్జున్, పార్థు, నందు, రవితేజ, మందరాజు మాదిగ).