- అల్పపీడన ప్రభావంతో నగరంలో వాన
- చలి గాలులతో జనం ఉక్కిరిబిక్కిరి
- మరో ఐదు రోజులు కనిష్ఠ ఉష్ణోగ్రతలే
- అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచన
హైదరాబాద్/సిటీబ్యూరో, డిసెంబర్ 26 (విజయక్రాంతి): బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్‌లో గత రెండురోజులుగా ముసురు వాన పడుతుంది. గురువారం సైతం పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది.
మధ్యాహ్నం సైతం చల్లని గాలులు వీస్తుడంటంతో ప్రజలు బయటికి రావడానికి వణుకుతున్నారు. గురువారం సాయంత్రం కురిసిన ఓ మోస్తరు వానతో కార్యాలయాల నుంచి ఇంటికి వెళ్లే ఉద్యోగులు, కార్మికులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. క్రిస్‌మస్ సెలవు అయినప్పటికీ నగరంలో పలుచోట్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మాదాపూర్, హైటెక్‌సిటీ, హబ్సిగూడ, తార్నాక, సికింద్రాబాద్, దిల్‌సుఖ్‌నగర్, కాప్రా, ఏఎస్‌రావు నగర్, సైనిక్‌పురి, ఎల్బీనగర్, నాగోల్, ఉప్పల్, రాంనగర్, ఓయూ, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, ట్యాంక్‌బండ్, ఖైరతాబాద్, సోమాజిగూడ, పంజాగుట్ట, లక్డీకపూల్, మెహదీపట్నంతో పాటు పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది.
శుక్రవారం కూడా నగరంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాబోయే ఐదు రోజులు ఉదయం వేళ పొగమంచు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
వచ్చే ఐదు రోజులపాటు కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 డిగ్రీల నుంచి 4 డిగ్రీల ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. గురువారం జీహెచ్‌ఎంసీ పరిధిలో 0.6 మిల్లీమీటర్ల అత్యల్ప వర్షపాతం నమోదు కాగా, అత్యధికంగా హయత్‌నగర్‌లో 2.0 మిల్లీమీటర్లు నమోదైంది.
మరో రెండు రోజులు వర్షాలు
అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలోని పలుచోట్ల గురువారం తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. జనగామ, ములుగు, వరంగల్, నల్లగొండ, ఖమ్మం, జయశంకర్ భూపాలపల్లి, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, హనుమకొండ, సిద్దిపేట, నల్లగొండ, నాగర్ కర్నూల్, మహబూబా బాద్, భద్రాద్రి కొత్తగూడెం, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, పెద్దపల్లి జిల్లాలోని కొన్ని చోట్ల వర్షం పడింది. జనగామ జిల్లాలోని ఘన్‌పూర్‌లో అత్యధికంగా 8.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.