దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి
మహబూబ్ నగర్ జనవరి 11 (విజయ క్రాంతి) : కురుమూర్తి ఆలయాన్ని అభివృద్ధి చేసేందుకు గడిచిన 70 సంవత్సరాలు నుంచి ఏ ముఖ్యమంత్రి రాలేదని దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి అన్నారు. శనివారం చిన్న చింతకుంట మండలంలోని శ్రీ కురుమూర్తి స్వామి దేవస్థానం వద్ద విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో కురుమూర్తి గుట్ట వద్ద నిర్వహించిన గిరి ప్రదర్శన కార్యక్రమంలో పాల్గొన్న దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి, వనపర్తి ఎమ్మెల్యే మేఘా రెడ్డి మాట్లాడారు.
కురుమూర్తి స్వామి దర్శనానికి వృద్ధులు, వికలాంగులు పడుతున్న ఇబ్బందులను గుర్తించి ఎలివేటేడ్ కారిడార్ తో కూడిన ఘాట్ రోడ్ నిర్మించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కోరడంతో మన పాలమూరు బిడ్డ కావడం వల్ల కురుమూర్తి క్షేత్రానికి దర్శనానికి రావడంతో పాటు, ఎలివేటేడ్ కారిడార్ తో కూడిన ఘాట్ రోడ్ నిర్మాణానికి రూ.110 కోట్లు మంజూరు చేసి, కారిడార్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారని చెప్పారు.
దేవాలయ అభివృద్ధికి ప్రతిపాదనలు పంపమని తెలియజేయడంతో, భక్తుల సౌకర్యార్థం కళ్యాణమండపం, కాటేజెస్, తదితర అభివృద్ధి పనులు చేపట్టాలంటూ రూ .66 కోట్లతో ప్రతిపాదనలు కలెక్టర్ కు పంపించడం జరిగిందని తెలియజేశారు. కురుమూర్తి గిరి ప్రదర్శన కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన నిర్వాహకులకు అభినందనలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా జడ్పీ చైర్ పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి, టీపీసీసీ ఆర్గనైజింగ్ సెక్రటరీ అరవింద్ రెడ్డి, కురుమూర్తి దేవస్థాన చైర్మన్ శ్రీ. గోవర్ధన్ రెడ్డి, ప్రజా ప్రతినిధులు విశ్వహిందూ పరిషత్ నాయకులుఉన్నారు.