ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ...
బెల్లంపల్లి (విజయక్రాంతి): వర్గీకరణ అమలు చేస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాక్షాత్తు అసెంబ్లీలో ప్రకటించి తీవ్రంగా మోసం చేశారని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ఆరోపించారు. బుధవారం రాత్రి బెల్లంపల్లికి వచ్చిన సందర్భంగా స్థానిక పద్మశాలి భవన్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట తప్పడంతోనే ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో రోడ్డెక్కి పోరాడాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎస్సీ వర్గీకరణను అమలు చేస్తానని ప్రకటించడం సంతోషమన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొంతమంది మాల కుల సంపన్నుల మాట విని వర్గీకరణ అమలును చేయటం లేదని విమర్శించారు. వర్గీకరణ విషయంలో తాడోపేడో తేల్చుకునేందుకే లక్ష డప్పులు వేయి గొంతులతో హైదరాబాద్లో సభ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రతి మాదిగ బిడ్డ డప్పు చంకన వేసుకొని హైదరాబాదులో జరిగే సభకు తరలిరావాలని పిలుపునిచ్చారు. లక్ష డప్పులు, వెయ్యి గొంతులతో మాదిగ జాతి నినదించే శంఖారావంతో భూమి ఆకాశం దద్దరిల్లాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ఎమ్మార్పీఎస్ ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.