ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ కు ఫిర్యాదు...
కామారెడ్డి (విజయక్రాంతి): జిల్లాలో గల గురుకుల పాఠశాలలు, హాస్టల్లో, ఆదర్శ పాఠశాలలు, ప్రభుత్వ ఎస్ సి, ఎస్టి, హాస్టల్ల లో క్యాటరింగ్ నిర్వహిస్తున్న కాంట్రాక్టర్లకు ఛార్జీలు పెంచాలని సోమవారం జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ కు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. గత సంవత్సరం జూలైలో ఏర్పాటు చేసిన మెనూ ప్రకారమే ఛార్జీలు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. మెనూ ఛార్జీలు పెంచకపోవడంతో క్యాటరింగ్ పనులు చేస్తున్న వారిపై విపరీతమైన భారం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉదయం నాలుగు గంటల నుండి రాత్రి 10 గంటల వరకు పనిచేయవలసిన అవసరం వస్తుందన్నారు. ప్రతిరోజు సిలిండర్లు అధికంగా వాడడంతో అలాగే మెనూ ప్రకారం ధరలు పెరగడంతో ఇబ్బందులు ఏర్పడుతున్నాయని అన్నారు.
ప్రతిరోజు కావలసిన కూరగాయల మెనూ ప్రకారం అధికారులు ఒక పక్క కోరడంతో కూరగాయలు మార్కెట్లో లభించకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వారు మెనూలో సూచించిన కూరగాయలు మాత్రమే తేవాలని ఇతర కూరగాయలు మార్కెట్లో అందుబాటులో ఉండడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇతర కూరగాయలు అందుబాటులో ఉన్నప్పుడు తేవడం జరుగుతుందని అన్నారు. ప్రభుత్వాధికారులు మెనులో సూచించిన కూరగాయలు మాత్రమే తేవాలని వేరే కూరగాయలు తెస్తే చర్యలు తప్పవని వారిని హెచ్చరించడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అలాగే పెరిగిన కూరగాయల ధరల ప్రకారం తమకు ఛార్జీలు చెల్లించడం లేదన్నారు. గత ఏడాది పనులు చేసిన మెనూ ప్రకారమే చార్జీలు చెల్లించడంతో కూరగాయల రేట్లు పెరగడంతో భారం పడుతుందని వారన్నారు. మెస్ ఛార్జీలు పెంచిన ప్రభుత్వము కాంట్రాక్టర్లకు మాత్రం పెంచకపోవడం శోచనీయమన్నారు. దీంతో క్యాటరింగ్ చేసే కాంట్రాక్టర్లు తీవ్ర నష్టం వాటిల్లోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. మెస్ ఛార్జీలు పెంచిన విధంగా కేటరింగ్ ఛార్జీలు కూడా పెంచాలని వారు జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ ను కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా క్యాటరింగ్ ప్రతినిధులు, కృష్ణారెడ్డి, విజయ్ కుమార్, ఎస్.కె రషీద్, సాయిలు, గోపాల్, హరి, వినోద్ తదితరులు పాల్గొన్నారు.