calender_icon.png 15 November, 2024 | 4:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రూప్‌ల గలాట!

16-06-2024 12:05:00 AM

లాహోర్: టీ20 ప్రపంచకప్‌లో మాజీ చాంపియన్ పాకిస్థాన్ లీగ్ దశలోనే ఇంటిబాట పట్టింది. అమెరికా, టీమిండియాతో జరిగిన మ్యాచ్‌ల్లో ఓటములు దాయాదిని టోర్నీ నుంచి నిష్క్రమించేలా చేశాయి. పాక్ ఘోర వైపల్యంపై విమర్శలు వ్యక్తమవుతున్న వేళ తాజాగా బాబర్ సేన జట్టులో మూడు గ్రూప్‌లు ఉన్నాయనే వాదన బలంగా వినిపిస్తోంది. ఇదే జట్టు ఓటమికి ప్రధాన కారణమని క్రీడా పండితులు విశ్లేషిస్తున్నారు. ‘ప్రస్తుతం పాకిస్థాన్ జట్టులో గ్రూప్ రాజకీయం నడుస్తోంది. టీమ్‌లో మూడు వర్గాలు ఉన్నాయి. ఒక వర్గానికి బాబర్ ఆజమ్, మరో వర్గానికి షాహిన్ అఫ్రిది, మూడో వర్గానికి మహమ్మద్ రిజ్వాన్‌లు నేతృత్వం వహిస్తున్నారు. 

సీనియర్లు మహమ్మద్ ఆమిర్, ఇమాద్ వసీమ్‌లను తిరిగి జట్టులోకి ఎంపిక చేయడం కూడా జట్టు పతనానికి కారణమైంది. టీ20 ప్రపంచకప్ ప్రారంభానికి ముందు అఫ్రిదిని కెప్టెన్సీ బాధ్యతలు నుంచి తప్పించి మరోసారి బాబర్‌కు నాయకత్వం అప్పగించారు. ఇది అఫ్రిదికి మింగుడుపడని అంశం. మరోవైపు వైస్‌కెప్టెన్‌గా ప్రమోషన్ కొట్టేద్దామనుకున్న రిజ్వాన్‌కు షాదాబ్ ఖాన్ రూపంలో షాక్ ఎదురైంది. తీవ్ర అసంతృప్తితో రగిలిపోయిన రిజ్వాన్, అఫ్రిదిలు కెప్టెన్ బాబర్‌తో అంటీ ముట్టినట్లు వ్యవహరించారు. మైదానంలో కూడా ఆటగాళ్లంతా ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా వ్యవహరించడం కూడా పాక్ ఘోర ఓటమికి కారణం’ అని పీసీబీ ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు. 2009లో చాంపియన్ అయిన పాకిస్థాన్ నిరుడు ప్రపంచకప్‌లో రన్నరప్‌గా నిలవడం విశేషం. అయితే ఈసారి మాత్రం కనీసం పోరాడకుండానే బాబర్ సేన అవమానకర రీతిలో వైదొలిగింది.