‘ఇందిరమ్మ’ కోసం 82.82 లక్షల దరఖాస్తులు
ఒక్కో నియోజక వర్గానికి 3,500 ఇళ్లు కేటాయింపు
ఏడాదిలో సర్కార్ ఇచ్చేది 4.50 లక్షల ఇండ్లే..
ఐదేళ్లలో మొత్తం 20.20 లక్షల ఇళ్లు మాత్రమే
ఒక్కో లబ్ధిదారుడికి రూ.5 లక్షలు అందజేత
ఎస్సీ, ఎస్టీలకు రూ.6 లక్షలు ఇవ్వాలని నిర్ణయం
హైదరాబాద్, ఆగస్టు 5 (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక సవాల్‌గా మారనుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఒక్కో నియోజకవర్గానికి ౩,౫౦౦ ఇండ్ల చొప్పున మొత్తం ౧౧౯ నియోజకవర్గాలకు ౪.౫ లక్షల ఇళ్ల మంజూరుకు ప్రభుత్వం నిర్ణయించింది.
వీటిలో ౩౩,౫౦౦ ఇళ్లను రిజర్వు కోటా కింద ఉంచాలని యోచిస్తోంది. ఇదే విషయాన్ని అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లోనూ వెల్లడించింది. ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు ఒక్కొక్కరికి రూ.6 లక్షల చొప్పున ఇవ్వాలని, మిగతావారికి రూ. 5 లక్షల చొప్పున ఇవ్వాలని నిర్ణయించింది.
ఇక్కడివరకు బాగానే ఉన్నా ప్రజా పాలనలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల కోసం 82,82,332 దరఖాస్తులు వచ్చినట్టు అధికారులు చెప్తున్నారు. వీటిలో చాలావరకు ఒకే రేషన్‌కార్డు నంబర్‌తో వచ్చాయని, వడపోత కార్యక్రమం చేపట్టి, నిజమైన లబ్ధిదారులను గుర్తించే పనిలో అధికార వర్గాలు నిమగ్నమయ్యాయి. ఈ ఇందిరమ్మ ఇళ్ల పథకానికి హడ్కో నుంచి రుణం తీసుకున్నది.
అంతేకాకుండా కేంద్రం ‘ప్రధాన మంత్రి అవాస్ యోజన పథకం’ కింద ఇచ్చే ఇళ్ల పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆలోచన చేస్తోంది. ఈ పథకం కింద ఒక్కో లబ్ధిదారుడికి గ్రామాల్లో రూ.1.30 లక్షలు, పట్టణాల్లో రూ.2.67 లక్షలు ఇవ్వనుంది. కేంద్రం నుంచి వచ్చే డబ్బులు పోగా మిగతా డబ్బులను రాష్ట్ర ప్రభుత్వం భరించేలా ప్రణాళికలు రూపొందిస్తునట్టు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.
రూ.5 వేల రుణం కోసం ప్రతిపాదనలు
ఇళ్ల నిర్మాణాల కోసం హౌసింగ్ శాఖ అధికారులు హడ్కోకు రూ.5 వేల కోట్ల రుణం కోసం ప్రతిపాదనలు పంపారు. ప్రాథమికంగా రూ.3 వేల కోట్లను విడుదల చేసేందుకు నిర్ణయించినట్టు తెలిసింది. దశల వారీగా హడ్కో నిధులు విడుదల చేయాలని నిర్ణయం తీసుకుని, మొదటి విడత రూ.850 కోట్లు ఇవ్వాలని నిర్ణయించింది.
ప్రభుత్వం మరికొన్ని నిధులు కావాలని కోరడంతో మొదటి విడతలో రూ.వెయ్యి కోట్లు రుణాన్ని అందించింది. రానున్న రోజుల్లో మరో రూ.2 వేల కోట్లను రాష్ట్ర ప్రభుత్వం పూచికత్తుపై రాష్ట్ర గృహనిర్మాణ సంస్థకు రుణం ఇచ్చేందుకు హడ్కో అంగీకారం తెలిపింది.
మార్చి 11న ఇందిరమ్మ పథకం ప్రారంభం
ఇళ్ల నిర్మాణానికి ఇతర రాష్ట్రాలు అనుసరిస్తున్న విధానాలపై ప్రభుత్వ ఆదేశాలతో అధికారులు అధ్యయనం చేయనున్నారు. ఈ మేరకు మార్గదర్శకాలను కూడా జారీచేసింది. అధికారుల పర్యవేక్షణలోనే లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణం చేసుకోవాల్సి ఉంటుంది. మంజూరైన నిధులను ప్రభుత్వం ౪ దశల్లో విడుదల చేయనుంది.
ఈ పథకాన్ని సీఎం రేవంత్‌రెడ్డి మార్చి 11న భద్రాచలంలో లాంఛనంగా ప్రారంభిం చడంతోపాటు ఇళ్ల నమూనాలను సైతం ఆవిష్కరించారు. గత బీఆర్‌ఎస్ సర్కార్ పేదలకు ఇళ్లు నిర్మించి ఇవ్వాలనే ఆలోచన చేయలేదని, కేంద్ర నిధులను కూడా సద్వినియోగం చేసుకోలేదని కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు.
పదేళ్ల క్రితం కాంగ్రెస్ హయాంలో ఇచ్చిన ఇందిరమ్మ ఇళ్లే గ్రామాల్లో ఉన్నాయని, ఆ తర్వాత పదేళ్లు పాలించిన కేసీఆర్ సర్కార్ పేదలకు గూడు కట్టించి ఇవ్వలేదని, అందుకే లక్షల్లో దరఖాస్తులు వచ్చాయని చెప్తున్నారు. మొదటి విడతలో పూర్తిగా ఇళ్లు లేని ప్రాధాన్యత ఇవ్వాలనే ఆలోచనతో ఉన్నారు.
ఇళ్లు లేని ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇంటిని నిర్మించి ఇస్తామని ప్రభుత్వం చెప్తోంది. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ మాత్రం సర్కార్‌కు సవాల్‌గానే మారుతుందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.