calender_icon.png 18 April, 2025 | 2:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరలు తగ్గించాలి

10-04-2025 05:48:06 PM

సీపీఐ ఆధ్వర్యంలో ఖాళీ సిలిండర్లతో నిరసన...

పాల్వంచ (విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ బండపై రూ.50ని వెంటనే ఉపసంహరించుకోవాలని సీపీఐ పట్టణ సహాయ కార్యదర్శి ఉప్పుశెట్టి రాహుల్, జిల్లా సమితి సభ్యులు బండి నాగేశ్వరరావు, మహిళా సమాఖ్య జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ వీసంశెట్టి పద్మజ డిమాండ్ చేశారు. గురువారం సిపిఐ, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో స్థానిక ksp రోడ్డులో ఖాళీ సిలిండర్లతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. వంట గ్యాస్ ధర పెంచడం మూలంగా పేద మధ్యతరగతి ప్రజలపై తీరని భారం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే అనేక నిత్యవసర వస్తువులు ధరలు పెరిగి తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలపై గ్యాస్ బండ భార మోపటం ఎంతవరకు సబబని ప్రశ్నించారు.

అంతర్జాతీయ వ్యాప్తంగా ఆయిల్ ధరలు తగ్గుముఖం పట్టినప్పటికీ దానికి అనుగుణంగా పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను తగ్గించాల్సిన మోడీ ప్రభుత్వం ఆయిల్ కంపెనీల లాభాల కోసం ప్రజలపై భారాలు మోపుతున్నారని మండిపడ్డారు. పెంచిన గ్యాస్ ధరలను తగ్గించేంతవరకు పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు అన్నారపు వెంకటేశ్వర్లు, శనగరపు శ్రీనివాసరావు, చెన్నయ్య, నిమ్మల రాంబాబు, నరహరి నాగేశ్వరరావు, కమటం ఈశ్వరమ్మ, బీవీ సత్యనారాయణ, జకరయ్య, ఆదినారాయణ, క్రాంతి, కరీం, ఖలీల్, లాల్ పాషా తదితరులు పాల్గొన్నారు.