15-03-2025 10:12:57 PM
జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య..
బీసీలకు వ్యతిరేకంగా వ్యవహరించిన పార్టీలను వెలివేయాలి..
మాజీమంత్రి వి. శ్రీనివాస్ గౌడ్..
బీసీలు ఐక్యంగా ఉండి తమ హక్కుల సాధనకు ముందుకు సాగాలి..
మాజీ ఎంపీ వి. హనుమంతరావు..
గత 77 ఏళ్లుగా బీసీలు అన్ని రంగాలలో అన్యాయానికి గురయ్యారు..
విశ్రాంత ఐఏఎస్ అధికారి చిరంజీవులు..
అఖిలపక్ష సమావేశంలో వక్తలు..
ముషీరాబాద్ (విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వం కులాల వారిగా జనాభా లెక్కలు సేకరించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. ప్రభుత్వాలు కులాల జనాభా ప్రాతివధికగా బడ్జెట్ కేటాయించి ప్రణాళికా బద్ధంగా అమలు చేయాలన్నారు. ఈ మేరకు శనివారం కాచిగూడలోని హోటల్ అభినందన్ గ్రాండ్స్ లో ఓబీసీ డెమోక్రెటిక్ జేఏసీ ఆధ్వర్యంలో 'ఓబీసీల సమస్యల పరిష్కారానికి రాజ్యాధికారమే అంతిమ లక్ష్యం' అనే అంశంపై అఖిలపక్ష సమావేశం ఓబీసీ డెమోక్రెటిక్ జేఏసీ చైర్మన్ కోలా జనార్ధన్, జాతీయ బీసీ సంక్షేమం సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జకృష్ణ అధ్యక్షతన జరిగింది.
ఈ సమావేశానికి 80 కుల సంఘాలు, 36 బీసీ సంఘాలు, 42 ఉద్యోగ సంఘాల నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ ఆర్. కృష్ణయ్య ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడుతూ... పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టి చట్టసభల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు అన్ని రాజకీయ పార్టీలు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని, లేని పక్షంలో రాజకీయ పార్టీల ప్రజాప్రతినిధులను బహిష్కరించాలని ఆయన పిలుపునిచ్చారు. దేశంలో బీసీ నివాధం బలంగా ఉన్నదని. బీసీలు రాజ్యాదికార దిశగా ఉద్యమించాలని ఆయన పిలువునిచ్చారు. ప్రభుత్వాలు ఓబీసీలకు పంచాయితీ సభ్యుల నుండి పార్లమెంట్ సభ్యుల వరకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలని అన్నారు. మహిళలకు అన్ని రంగాల్లో కులాల జనాభా ప్రాతివధికన ప్రాతినిధ్యం కల్పించాలని అన్నారు.
నాణ్యమైన శాస్త్రీయ సమాన విద్యావకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగంలోనే నాణ్యమైన వైద్య సేవలు అందించాలని అన్నారు. స్వామినాథన్ కమిషన్ నివేదిక ఆధారంగా వ్యవసాయ రంగాన్ని అభివృద్ది చేయాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఓబీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని అన్నారు. ప్రభుత్వాలు ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను విరమించుకోవాలని అన్నారు. మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ అన్ని పార్టీలు బీసీల జనం చేస్తున్నాయని, బీసీలకు వ్యతిరేకంగా వ్యవహరించిన పార్టీలను వెలివేయాలని ఆయన అన్నారు. బీసీలను ఓట్లేసే యంత్రాలుగానే చూస్తున్నారని అన్నారు. రాజకీయ వ్యవస్థ యుద్ధం లాంటిదని, ఎన్నికల్లో మన ఓట్లు మనమే చేసుకొని రాజ్యాధికార దిశగా ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు. మాజీ ఎంపీ వి. హనుమంతారావు మాట్లాడుతూ.. రాజకీయంగా తనను బడుగు బలహీన వర్గాలే ఎదగకుండా దెబ్బతీశాయని, బీసీలు ఐక్యంగా ఉండి తమ హక్కుల సాధనకు ముందుకు సాగాలని అన్నారు.
ముఖ్యంగా బీసీలకు రాజ్యాధికారంతోనే అభివృద్ధి సాధ్యమన్నారు. బీసీ ఉద్యమానికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని అన్నారు. విశ్రాంత ఐఏఎన్ అధికారి చిరంజీవులు మాట్లాడుతూ... గత 77 ఏండ్లుగా బీసీలు అన్ని రంగాలలో అన్యాయానికి గురయ్యారని అన్నారు. రాజ్యాధికారమే లక్ష్యంగా బీసీలు ఉద్యమించాలని అన్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం బీసీలు ఏ విధంగా ఉద్యమించారో అదే విధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీలను కలుపుకొని రాజ్యాధికార దిశగా ముండుకు సాగాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం, బీసీ సంఘాల నాయకులు నాయకులు నీల వెంకటేశ్ ముదిరాజ్, అనంతయ్య, వేముల రాచుకృష్ణ, రాజీండర్, సుధాకర్, సుందర్ రాజు యాదవ్, మహిళా నాయకులు రాజ్యలక్ష్మి, రామారావు గౌడ్, ఉడయ్ నేత, బాలయ్య, వివిధ కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు.