11-02-2025 01:34:35 AM
తెలంగాణ ప్రజా సంఘాల పోరాట వేదిక
ముషీరాబాద్, ఫిబ్రవరి 10: కార్పొరేట్‌లకు అనుకూల ఉన్న కేంద్ర బడ్జెట్‌ను సవరించాలని, సవరించే వరకు ఐక్య ఉద్యమాలు నిర్వహిస్తామని పలువురు వక్తలు పేర్కొన్నారు. సోమవారం ఇందిరాపార్కు ధర్నాచౌక్‌లో తెలంగాణ ప్రజా సంఘాల పోరాట వేదిక ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా వేదిక రాష్ట్ర కన్వీనర్ ఎస్ వీరయ్య, సీపీఎం రాష్ట్ర అధ్యక్షుడు జాన్‌వెస్లీ, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు తమ్మినేనీ వీరభద్రం మాట్లాడుతూ.. కేంద్ర బడ్జెట్ అదానీ, అంబానీలకు మేలు చేకూర్చే విధంగా ఉన్నదన్నారు.
రైతులు, వ్యవసాయ కూలీలు, కార్మికులు, దళితులు, గిరిజనులు, బలహీనవర్గా లు, మైనారిటీలు, మహిళలకు వ్యతిరేకంగా ఉన్నదని విమర్శించారు. దీనిని సవరించే వరకు ఐక్యంగా పోరాడుతామని వారు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రానికి విభజన హామీల్లో ఏ ఒక్కటి అమలు కాలేదని అన్నారు. తెలంగాణ రాష్ట్రం నుంచి 8 మంది ఎంపీలు, ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నా ఏమీ సాధించలేకపోయారని అన్నారు. కార్యక్రమంలో చుక్కా రాములు, జూలకంటి రండారెడ్డి, స్కైలాబ్ బాబు, ఎంవీ రమణ, ధర్మానాయక్ తదితరులు పాల్గొన్నారు.