calender_icon.png 3 February, 2025 | 8:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేంద్ర బడ్జెట్ ధనికులకే ఉపయోగం..

03-02-2025 05:48:36 PM

ఎమ్మెల్యే కోరం కనకయ్య..

ఇల్లెందు (విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పేదల అభ్యున్నతికి కాదని, ధనికులను మరింత ధనవంతులుగా చేసే విధంగా ఉందని ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య అన్నారు. సోమవారం కేంద్ర బడ్జెట్ కు నిరసనగా పీసీసీ ఆదేశాల మేరకు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నుంచి జెకె కార్మికవాడలోని అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ చేపట్టి  ధర్నా నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోరం కనకయ్య మాట్లాడుతూ... రాజ్యాంగాన్ని గౌరవించకుండా దేశంలో అన్ని రాష్ట్రాలను సమానంగా చూడకుండా మోడీ నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మూడుసార్లు అధికారంలో ఉన్న కేంద్ర సర్కారు పేద, మధ్యతరగతి, గిరిజన ప్రజల అభివృద్ధికి అడ్డుకట్ట వేస్తూ వస్తుందన్నారు. తెలంగాణ ప్రాంత అభివృద్ధి విషయంలో కేంద్ర ప్రభుత్వం నిధులను కేటాయించకుండా ఈ ప్రాంతాన్ని వెనుకబాటుతనానికి చేరువ చేయాలని కుట్రలు చేస్తుందని విమర్శించారు. బడ్జెట్ లో తెలంగాణకు నిధులను కేటాయించకపోవడం బీజేపీ కుట్రకు నిదర్శనం అన్నారు. తెలంగాణ ఎంపీలు తెలంగాణకు జరుగుతున్న అన్యాయం పట్ల స్పందించి వెంటనే రాజీనామా చేయాలని అప్పుడే తెలంగాణ ప్రజలను గౌరవించినట్లుగా ఉంటుందన్నారు. తెలంగాణతో పాటు దేశంలో జరగబోయే అన్ని ఎన్నికల్లో మోడీ సర్కార్ కు ప్రజలు గట్టి గుణపాఠం చెప్పేందుకు సిద్ధం కావాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.

తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రుల ఆధ్వర్యంలో ఇచ్చిన హామీలన్నింటిని ఖచ్చితంగా అమలు చేసి తీరుతామని బీజేపీ కుట్రలను తిప్పికొడతామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు, మాజీ వైస్ ఎంపీపీ మండల రాము, మాజీ మున్సిపల్ చైర్మన్ యదలపల్లి అనసూయ, పార్టీ పట్టణ, మండల అధ్యక్షులు డానియల్, పులి సైదులు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు మడుగు సాంబమూర్తి, బోళ్ల సూర్యం, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.