22-02-2025 12:28:45 AM
ప్రముఖ ఆర్థిక విశ్లేషకుడు డాక్టర్ పాపారావు
భద్రాచలం, ఫిబ్రవరి 21 (విజయక్రాంతి): జీఎస్టీ పేరుతో ప్రజలపై పన్నులు వేసి వారి సంపదను కొల్లగొట్టి కార్పొరేట్లకు దోచి పెట్టే పద్ధతిలో కేంద్ర బడ్జెట్ ఉందని ప్రముఖ ఆర్థిక విశ్లేషకులు డాక్టర్ పాపారావు గారు అన్నారు. ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో సిఐటియు పట్టణ కన్వీనర్ ఎంబి నర్సారెడ్డి అధ్యక్షతన శుక్రవారం భద్రాచలంలో సదస్సు జరిగింది.ఈ సదస్సులో ముఖ్య వక్తగా ఆయన మాట్లాడుతూ కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ సరళీకరణ,ప్రపంచీకరణ, ప్రైవేటీకరణకు ఊతమిచ్చే పద్ధతులో ఉందని అన్నారు.
కేంద్ర ప్రభుత్వ విధానాలు కారణంగా పారిశ్రామిక ఉత్పత్తి సామర్థ్యం తగ్గిపోయిందని, నిరుద్యోగం పెరిగిపోయిందని అన్నారు. దేశవ్యాప్తంగా పేదరికం నిరుద్యోగం అసమానతలు తీవ్రంగా పెరిగాయని అన్నారు. ఈ బడ్జెట్ కొద్దిమంది ఇన్కమ్ టాక్స్ కట్టే వారికి మినహా మిగతా భారత దేశంలో జనాభా మొత్తానికి వ్యతిరేకమైన బడ్జెట్ అని అన్నారు.
ఈ బడ్జెట్లో కార్మిక సమస్యలు ఊసే ఎత్తలేదని, రైతులకు కనీస మద్దతు ధర గ్యారెంటీ చేసే చట్టం గురించి చర్చించలేదని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కోట్ల మంది వ్యవసాయ కార్మికులకు ఉపాధి కల్పించే ఉపాధి హామీ చట్టంకు నిధులు కోత విధించడం ఆర్థిక వ్యవస్థ పై ప్రభావం పడుతుందని అన్నారు. ప్రజల కొనుగోలు శక్తి పెరిగినప్పుడే పారిశ్రామిక రంగాలు అభివృద్ధి అవుతాయని అలాకాకుండా కేవలం కార్పొరేట్లకు రాయితీలు ఇస్తే ఉత్పత్తి అభివృద్ధి కాదని అన్నారు.
కార్మికులు, రైతులు, పేదలు ఈ విధానాలకు వ్యతిరేకంగా ఐక్యంగా ముందుకు సాగాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ సదస్సులో సిఐటియు జిల్లా అధ్యక్షులు కే బ్రహ్మచారి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి రేపాకుల శ్రీనివాస్ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు ఎలమంచి వంశీకృష్ణ, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి గడ్డం స్వామి,ఐద్వా జిల్లా ఉపాధ్యక్షులు నాదెళ్ల లీలావతి, గిరిజన సంఘం పట్టణ కార్యదర్శి కుంజా శ్రీనివాస్, కెవిపిఎస్ జిల్లా నాయకులు కోరాడ శ్రీనివాస్, డివైఎఫ్‌ఐ నాయకులు పి సంతోష్ కుమార్, సిపిఎం సీనియర్ నాయకులు జిఎస్ శంకర్రావు, బిబిజి తిలక్ తదితరులు పాల్గొన్నారు.