calender_icon.png 28 December, 2024 | 6:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆప్షన్ పెట్టిన సెంటర్లు ఇవ్వలే!

28-12-2024 03:42:53 AM

  1. ఇష్టారాజ్యంగా పరీక్ష సెంటర్లు కేటాయింపు
  2. టెట్ అభ్యర్థుల అభ్యంతరం 
  3. ఆలస్యంగా టెట్ హాల్‌టికెట్లు 
  4. మెహందీతో వస్తే నో ఎంట్రీ 
  5. 15ని. ముందే గేట్లు క్లోజ్

హైదరాబాద్, డిసెంబర్ 27 (విజయక్రాంతి): ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)కు హాజరయ్యేందుకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేటప్పుడు సెంటర్లు ఒకటి పెడితే, మరొకటి వచ్చాయి. అవికూడా దూరప్రాంతాల్లో పరీక్షా కేంద్రాలను కేటాయించారు. దీంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు.

ఓ అభ్యర్థి మొదటి ఆప్షన్ కరీంనగర్, సెకండ్ ఆప్షన్ సిద్దిపేట్, మూడో ఆప్షన్ హైదరాబాద్ పెడితే.. రెండు పేపర్లకు మేడ్చల్ మల్కాజ్‌గిరిలో సెంటర్ కేటాయించారు. ఈ ఏడాది మే, జూన్‌లో జరిగిన టెట్ పరీక్షకు ఎక్కువ మంది అభ్యర్థులకు సొంత ఉమ్మడి జిల్లాల్లోనే పరీక్షా కేంద్రాలు కేటాయించారు.

కానీ, ఈసారి మాత్రం ముందు ఇచ్చిన ఆప్షన్లను కాదని, చిరల్లో పెట్టిన ఆప్షన్ జిల్లాల్లో కేంద్రాలను కేటాయించారని అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. దరఖాస్తు చేసుకునే సమయంలో తమ తమ ప్రాధాన్యత, అనుకూలతలను బట్టి చుట్టు పక్కల జిల్లాలకు ఆప్షన్లు ఇచ్చుకుంటే, చాలా మందికి సంబంధంలేని జిల్లాల్లో పరీక్షా కేంద్రాలను కేటాయించారని అభ్యర్థులు తెలిపారు. 

ఆప్షన్‌లో లేని జిల్లాలకు కూడా..

ఆప్షన్ పెట్టుకున్న జిల్లాలకే కాకుండా పెట్టని జిల్లాల్లోనూ సెంటర్లు పడడంతో అభ్యర్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఖమ్మం జిల్లా అభ్యర్థులు తమ తొలి ప్రాధాన్యత ఖమ్మం, సత్తుపల్లి, సూర్యాపేట, వరంగల్ అని ఆప్షన్లు పెట్టుకోగా, సంబంధం లేకుండా వందల కిలోమీటర్ల దూరంలో ఉండే సిద్దిపేట, మేడ్చల్ జిల్లాల్లోని బాచుపల్లిలో సెంటర్లను వేశారని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. 

ఆలస్యంగా టెట్ హాల్‌టికెట్లు

టెట్‌కు సంబంధించిన హాల్ టికెట్లను ఆలస్యంగా విడుదల చేశారు. శుక్రవారం నుంచి హాల్‌టికెట్లు అందుబాటులో ఉంచారు. గురువారం నుంచే హాల్‌టికెట్లు విడుదలవుతాయని అధికారులు ప్రకటించడంతో అభ్యర్థులు నెట్ ముందు కూర్చున్నారు. కానీ గురువారం అర్థరాత్రి దాటక హాల్‌టికెట్లు విడుదలయ్యాయి. 

టెట్ రాతపరీక్షలను కంప్యూటర్ బేస్డ్ విధానంలో నిర్వహించనున్నారు. జనవరి 2వ తేదీ నుంచి 20వ తేదీ వరకు పది రోజుల పాటు 20 సెషన్లలో పరీక్షలను నిర్వహించనున్నారు. ప్రతి రోజు రెండు సెషన్లు అంటే.. సెషన్ ఉదయం 9 గంటల నుంచి 11.30 గంటల వరకు, సెషన్  మధ్యాహ్నం 2 గంటల నుంచి 4.30 గంటల వరకు నిర్వహించనున్నారు.

పేపర్-1 పరీక్షలను జనవరి 8, 9, 10, 18 తేదీల్లో నిర్వహించనున్నారు. పేపర్ -2 పరీక్షలను జనవరి 2, 5, 11, 12, 19, 20వ తేదీల్లో నిర్వహించనున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే 11వ తేదీ ఉదయం, 20వ తేదీ ఉదయం, మధ్యాహ్నం సెషన్‌లో జరిగే టెట్ పరీక్షల హాల్ టికెట్లను సాంకేతిక కారణాలతో ఈనెల 28 నుంచి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయని విద్యాశాఖ శుక్రవారం వెల్లడించింది. 

మెహందీతో వస్తే అనుమతిలేదు

-టెట్ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు అధికారులు పలు కీలక సూచనలు చేశారు. మెహందీతో వస్తే పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించేది లేదని స్పష్టంచేశారు. స్మార్ట్ వాచీలతో పాటు ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి లేదని తెలిపారు. హాల్‌టికెట్లపై సూచించిన నిబంధనలను అభ్యర్థులు పాటించాలని పేర్కొన్నారు.

రెండు గంటల ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. ఉదయం సెషన్‌కు హాజరయ్యే అభ్యర్థులను ఉదయం 7.30 నుంచి పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించనున్నారు. మధ్యాహ్నం సెషన్‌కు హాజరయ్యే వారిని మ. 12.30 గంటల నుంచి అనుమతించనున్నారు. -ఇక పరీక్ష ప్రారంభానికి 15 నిమిషాల ముందే పరీక్షా కేంద్రం గేట్లను క్లోజ్ చేయనున్నారు.

అంటే ఉదయం సెషన్‌లో  8.45కు, మధ్యాహ్నం సెషన్‌లో 1.45 గంటలకు గేట్లను మూసివేయనున్నారు.- అభ్యర్థులు తప్పనిసరిగా హాల్ టికెట్‌తో పాటు బ్లాక్ లేదా బ్లూ బాల్ పాయింట్ పెన్, గుర్తింపు కార్డు (ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్, పాస్ పోర్ట్, పాన్ కార్డు, ఓటర్ ఐడీ) తీసుకెళ్లాలి.