01-04-2025 04:49:57 PM
రాష్ట్ర ప్రభుత్వానిది కాదు..
బిజెపి జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర గౌడ్..
చెన్నూర్ (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రచారం చేసుకుంటున్నట్టుగా సన్న బియ్యం పథకం రేవంత్ రెడ్డిదో, రాష్ట్ర ప్రభుత్వానిదో కాదని.. ఈ పథకానికి సంవత్సరానికి రాష్ట్రంలో పది వేల కోట్ల రూపాయలు నరేంద్ర మోడీ ప్రభుత్వం ఖర్చు పెడుతుందని బిజెపి జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర గౌడ్ అన్నారు. మంగళవారం చెన్నూరులో ఆయన విలేకరులతో మాట్లాడారు. సొమ్ము ఒకరిది అయితే.., సోకు మరొకరిదిలా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తుందని, బిజెపి ప్రభుత్వం ఇస్తున్న ఉచిత రేషన్ బియ్యానికి కాంగ్రెస్ ప్రభుత్వం పేరు పెట్టుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. కరోనా సమయం నుంచి ప్రతి వ్యక్తికి ఐదు కిలోల బియ్యం నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉచితంగా అందజేస్తుందని, కేవలం ఒక కిలో మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తు మొత్తం తామే ఇస్తున్నట్టుగా ప్రచారం చేసుకోవడం సబబు కాదన్నారు.
వరి ధాన్యం సేకరణతో మొదలు.. బియ్యం పంపిణీ వరకు...
రాష్ట్రవ్యాప్తంగా రైతులు పండించిన వరి ధాన్యం సేకరణ నుంచి బియ్యం పంపిణీ వరకు కేంద్ర ప్రభుత్వం భరిస్తుందని బిజెపి జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర గౌడ్ అన్నారు. బియ్యం పంపిణీ కార్యక్రమం వడ్ల సేకరణతో ప్రారంభమవుతుందని, వడ్ల సేకరణలో భాగంగా రైతులకు గోనె సంచులు, సుతిలీ తాళ్లు, ట్రాన్స్ పోర్టేషన్, హమాలి ఇలా మొత్తం ఖర్చు కేంద్ర ప్రభుత్వమే భరిస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల నుంచి సేకరించిన వరి ధాన్యానికి చెల్లించాల్సిన మొత్తాన్ని బ్యాంకుల్లో అప్పు రూపంలో తీసుకువస్తుందని, ఆ మొత్తానికి వడ్డీ కూడా భారత ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు. ఇంత చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం బియ్యం పంపిణీ తామే చేస్తున్నట్లు ప్రచారం చేసుకోవడం శోచనీయమన్నారు.
ఈ విషయం తెలంగాణలోని ప్రతి వ్యక్తికి తెలుసునని, రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేసినంత మాత్రాన ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు. రేషన్ షాపుల్లో రేవంత్ రెడ్డి చిత్రపటాన్ని పెట్టడం నరేంద్ర మోడీ చిత్రపటాన్ని ఏర్పాటు చేయకపోవడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అహంకారానికి నిదర్శనమన్నారు. ఇలాగే అహంకారానికి పోయి గత ప్రభుత్వం కాలగర్భంలో కలిసిపోయిందని, భవిష్యత్తులో జరిగేది కూడా అదేనన్నారు. ఎన్ని కుట్రలు చేసినా రానున్నది బీజేపీ ప్రభుత్వమేనని ఆయన అన్నారు.