21-04-2025 01:34:00 AM
హైదరాబాద్ సిటీ బ్యూరో, ఏప్రిల్ 20 (విజయక్రాంతి): విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు పెంచుతూ తెలంగాణ అసెంబ్లీలో చేసిన చట్టాన్ని తమిళనాడు తరహాలో 9వ షెడ్యూల్‌లో చేర్చి బీసీ రిజర్వేషన్లకు రాజ్యాంగ భద్రత కల్పించడంపై కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ డిమాండ్ చేశారు.
బీసీ రిజర్వేషన్ల బిల్లుపై కేంద్రం తక్షణమే స్పందించాలని బీసీ హిందూ మహాసభ అధ్యక్షుడు బత్తుల సిద్ధేశ్వర్ గత 20 రోజులుగా ఢిల్లీలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆయనతో చర్చించి దీక్షను విరమింపజేయాలని ఆదివారం ప్రకటనలో కోరారు.
ఇప్పటికే సిద్ధేశ్వర్ ఆరోగ్యం క్షీణించిందని, తక్షణమే కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ చొరవ తీసుకొని ఆయన దీక్ష విరమింప జేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సిద్ధేశ్వర్ ప్రాణాలకు హాని జరిగితే కేంద్ర ప్రభుత్వం రాజకీయంగా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని శ్రీనివాస్‌గౌడ్ హెచ్చరించారు.
రెండు రోజుల్లో సిద్ధేశ్వర్‌కు మద్దతుగా హైదరాబాదులో అఖిలపక్షాలు, బీసీ సంఘాలు, కుల సంఘాలతో సమావేశం ఏర్పాటు చేసి భవిష్యత్ కార్యాచరణ ప్రకటించి దేశవ్యాప్తంగా ఉద్యమానికి శ్రీకారం చుడుతామని తెలిపారు. అసెంబ్లీలో ఆమోదించిన బిల్లును రాష్ర్ట గవర్నర్ కూడా ఆమోదించి రాష్ర్టపతికి పంపించి వారం రోజులు గడుస్తున్నా ఈ బిల్లుపై ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడం విచారకరమన్నారు.
అసెంబ్లీలో చేసిన బిల్లుకు రాష్ర్ట బీజేపీ మద్దతు కూడా తెలిపిందని, కేంద్ర ప్రభుత్వం మాత్రం ఇందుకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోందన్నారు. బీసీ బిల్లును ఆమోదించకపోవడంలో అంతర్యం ఏమిటని ఆయన ప్రశ్నించారు. బీజేపీలో ఒకే పార్టీ ఒకే విధానం ఉన్నట్లయితే ఇప్పటికైనా స్పందించాలని డిమాండ్ చేశారు.