21-02-2025 12:48:05 AM
హైదరాబాద్, ఫిబ్రవరి 20 (విజయక్రాంతి): ఉన్నత విద్యపై కేంద్ర ప్రభుత్వం గుత్తాధిపత్యం చలాయిస్తున్నదని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క ఆరోపించారు. ‘మీరు ఫుడ్ ఆర్డర్ చేయడానికి వీల్లేదు.. కానీ, మీరు బిల్లు చెల్లించాలి’ అన్న తరహాలో యూజీసీ కొత్త నిబంధనలు తీసుకొచ్చిందని మండిపడ్డారు.
కేరళ రాజధాని తిరువనంతపురంలో గురువా రం అక్కడి ప్రభుత్వం నిర్వహించిన జాతీయ ఉన్నత విద్యా సమ్మేళనంలో ఆయన తెలంగాణ ప్రతినిధిగా మాట్లాడారు. విద్య అనే అంశం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పరధిలోని ఉమ్మడి అంశమని, రెండు ప్రభుత్వాలు కలిసి పనిచేస్తేనే సత్ఫలితాలు సాధించగలుగుతామని అభిప్రాయపడ్డారు.
కానీ.. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఆ దిశలో ఆలోచించడం లేదని విమర్శించారు. యూజీసీ కొత్త నిబంధనలు అభ్యంతరకరంగా ఉన్నాయని, వర్సిటీలకు నిధులు సమకూర్చడమే రాష్ట్రప్రభుత్వాల విధి అన్నట్లు నిబంధులు ఉన్నాయని అభ్యంతరం వ్యక్తం చేశారు.
పరిస్థితి ఇలాగే కొనసాగితే రాష్ట్రాల్లో ఉన్నత విద్యపై నీలి నీడలు అలముకుంటాయని, స్వయం ప్రతిపత్తి లేకుండా ఏ రాష్ట్రమూ నాణ్యమైన విద్య అందించలేదని వాపోయారు. రాష్ట్రాలు ఉమ్మడి లక్ష్యంతో ఐక్యమైనప్పుడు కేంద్ర ప్రభుత్వం తప్పకుండా రాష్ట్రాలకు సహకరించాలని కోరారు.
వర్సిటీలకు వైస్ ఛాన్సలర్ల నియామకం, సెర్చ్ కమిటీలో రాష్ట్ర ప్రభుత్వ పాత్రను తొలగించడమేంటని ప్రశ్నించారు. అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశ పరీక్ష తప్పనిసరి చేయడంతో వెనుకబడిన వర్గాలకు చెందిన విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమవుతారని అన్నారు.
ఈ విధానం కార్పొరేట్, ప్రైవేటు సంస్థలను ప్రోత్సహిస్తుందని, పేద, మధ్యతరగతి వర్గాల యువతకు మేలు చేయదన్నారు. తమ ప్రభుత్వం వచ్చే జాతీయ ఉన్నత విద్యా సమావేశాన్ని హైదరాబాద్ లో నిర్వహించేందుకు సిద్ధంగా ఉందని ప్రకటించారు.
విద్యకు ప్రాధాన్యం..
తెలంగాణ ప్రభుత్వం విద్యకు ప్రాధాన్యమిస్తుందని డిప్యూటీ సీఎం తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలు నిర్మిస్తున్నామని, తద్వారా వెనుకవడి వర్గాల పిల్లలకు నాణ్యమైన విద్య అందుతుందన్నారు. యువతలో నైపుణ్యాలు మెరుగుపరిచేందుకు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ని నిర్మిస్తున్నామని, సాంకేతిక కోర్సుల్లోనూ నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని వెల్లడించారు.
విద్యా రంగంలో డిజిటల్ విధానాన్ని ప్రోత్సహిస్తున్నామని వివరించారు. సంక్షేమ హాస్టల్ విద్యార్థులు, గురుకుల పాఠశాల విద్యార్థులు బోర్డు పరీక్షలతో పాటు పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు వీలుగా ప్రణాళికలు అమలు చేస్తున్నామని తెలిపారు.
ప్రభుత్వం చొరవతో రాష్ట్రంలో విద్యార్థుల నమోదు నిష్పత్తి 40 శాతానికి పెరిగిందని, జాతీయ స్థాయిలో సగటు 28.4 శాతం నమోదైందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో కేరళ సీఎం పినరయి విజయన్, ఆ రాష్ట్ర ఉన్నత విద్యశాఖ మంత్రి ఆర్.బిందు, కర్ణాటక మంత్రి సుధాకర్ అవారేతో పాటు ప్రముఖ విద్యావేత్తలు పాల్గొన్నారు.