11-04-2025 01:25:22 AM
హైదరాబాద్, ఏప్రిల్ 10 (విజయక్రాంతి): ‘దారిద్య్ర రేఖకు దిగువ ఉన్న వారికి కేంద్రం ఇస్తున్నది దొడ్డు బియ్యం మాత్రమే. సన్నబియ్యం కాదు. రేషన్‌కార్డు లబ్ధిదారుల కోసం రాష్ట్రప్రభుత్వం అదనపు భారం మోస్తూ సన్నబియ్యం పంపిణీ చేస్తున్నది. కొందరు కావాలని అసత్య ప్రచారం చేస్తున్నారు. ఆ ప్రచారాన్ని ప్రజలు నమ్మొద్దు..’ రాష్ట్ర పౌర సరఫరాలశాఖ -మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు.
గురువారం హైదరాబా ద్ నుంచి ఆయన ప్రజాప్రతినిధులు, కార్పొరేషన్ చైర్మన్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. దేశంలో సన్నబియ్యం పంపిణీ చేస్తున్న రాష్ట్రం ఒక్క తెలంగాణ మాత్రమేనని స్పష్టం చేశారు. రాష్ట్రప్రభుత్వం చొరవ తీసుకుని 20 శాతం అదనంగా నిధులు వెచ్చించి సన్న బియ్యం పంపిణీ సేకరిస్తున్నామని వెల్లడించారు.
దొడ్డు బియ్యం పక్కదోవ పడుతున్నదనే కారణంతోనే ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీకి శ్రీకారం చుట్టిందన్నారు. రాష్ట్రంలో అర్హులందరికీ తెల్ల రేషన్ కార్డులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం రేషన్‌కార్డు దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయని, ఆ తర్వాత త్వరితగతిన కార్డులు చేస్తామని వెల్లడించారు. గత ప్రభుత్వం రేషన్‌కార్డుల జారీలో పూర్తి నిర్లక్ష్యం వహించిందని మండిపడ్డారు.
తమ ప్రభుత్వం కొత్త కార్డులు ఇచ్చి న తర్వాత కార్డుదారుల సంఖ్య 2.81 కోట్ల నుంచి 3.10 కోట్లకు చేరుకోవచ్చని అంచనా వేశారు. అయినప్పటికీ లబ్ధిదారులకు సరిప డా సన్న బియ్యం పంపిణీ చేసేందుకు రాష్ట్రప్రభుత్వం సన్నద్ధంగా ఉందని వివరించారు. సన్నాల సాగును రాష్ట్రప్రభు త్వం ప్రోత్సహిస్తున్నదని, రైతులకు క్వింటాకు రూ.500 చొప్పున బోనస్ ఇస్తున్నామని తెలిపారు.
ధాన్యం కొనుగోలు ప్రక్రియలో కలెక్టర్లకే పూర్తిస్థాయిలో అధికారం ఇచ్చామన్నారు. 25 శాతానికి మించి నూకలు ఉన్న బియ్యం సరఫరా చేస్తే రైస్ మిల్లర్లపై చర్యలు కఠినంగా ఉంటాయని ఆయన హెచ్చరించారు.