22-04-2025 02:08:59 AM
చేవెళ్ల, ఏప్రిల్ 21: కేంద్రం ఇటీవల ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో విద్యారంగానికి తీవ్ర అన్యాయం చేసిందని ఎస్ ఎఫ్ ఐ జిల్లా అధ్యక్షుడు కేవై ప్రణయ్ మండిపడ్డారు. సోమవారం చేవెళ్లలోని అంబేద్కర్ భవన్ లో ఎస్‌ఎఫ్ ఐ చేవెళ్ల డివిజన్ ప్రధాన కార్యదర్శి అరుణ్ అధ్యక్షతన నిర్వహించిన డివిజన్ కమిటీ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ... కేంద్రం విద్యారంగాన్ని కార్పొరేట్, ప్రైవేట్ రంగానికి అప్పజెప్పే కుట్రలు చేస్తోందని, బడ్జెట్లో నిధులు తగ్గించడమే ఇందుకు నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం తీసుకొచ్చిన నూతన విద్యావిధానం అమలు చేయాలంటే రూ.4.82 లక్షల కోట్లు అవసరం కాగా.. 1.25 లక్షల కోట్లు మాత్రమే కేటాయించడమేంటని ప్రశ్నించారు.
కనీసం ములుగు ట్రైబల్ యూనివర్శీటీకి నిధులివ్వలేదని, జిల్లాకో నవోదయ, ఏకలవ్య పాఠశాలల ప్రస్థావనే లేదన్నారు. రాష్ట్రంలో 30 శాతం నిధులు విద్యారంగానికి కేటాయించి... విద్యాశాఖకు మంత్రిని నియమించాలని డిమాండ్ చేశారు.
ఏప్రిల్ 25, 26,27 తేదీల్లో ఖమ్మం పట్టణంలో జరిగే 5వ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం ఎస్‌ఎఫ్‌ఐ చేవెళ్ల డివిజన్ అధ్యక్ష కార్యదర్శులుగా ఎరవల్లి శ్రీనివాస్, బేగరి అరుణ్ కుమార్, డివిజన్ ఉపాధ్యక్షులుగా సమీర్, యశ్వంత్, వివేకానంద, దిలీప్, సహాయ కార్యదర్శులుగా చరణ్ గౌడ్, చందు తేజ, పండుతో పాటు డివిజన్ కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు.