14-02-2025 11:39:01 PM
త్రిపుర రాజధానిలో ఘటన..
అగర్తల: అవినీతి కార్యకలాపాలకు పాల్పడే వారి తాట తీసే సీబీఐ ఆఫీసుపైనే దొంగలు తమ చేతివాటం ప్రదర్శించారు. ఈ సంఘటన త్రిపుర రాజధాని అగర్తలలో చోటు చేసుకుంది. భద్రత అత్యంత కట్టుదిట్టంగా ఉండే ష్యామలీ బజార్ కాంప్లెక్స్‌లోని సీబీఐ ఆఫీసులో ఈ దోపిడి జరిగింది. కంటికి కనిపించిన ప్రతీ వస్తువును దోచుకెళ్లడం విశేషం. ఆఫీస్ ఆవరణలో గోడలు మినహా స్టీల్ అల్మారాలు, కుర్చీలు, ఎలక్ట్రిక్ సామాన్లు, డోర్లు.. చివరకు కిటికీలను కూడా వదల్లేదు. ఇటీవలే అధికారులు ఆ బ్రాంచ్‌కు వెళ్లగా విషయం వెలుగులోకి వచ్చింది.
గత ఐదు నెలలుగా సీబీఐ ఆఫీస్ మూసి ఉంచడంతో దొంగతనం జరిగినట్లు అధికారులు తెలిపారు. సీబీఐ అధికారుల ఫిర్యాదుతో పోలీసులు ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారించారు. ఆ తర్వాత మరో నలుగురిని అరెస్ట్ చేశారు. వారి నుంచి ఎనిమిది స్టీల్ అల్మారాలు, ఏడు కుర్చీలు, నాలుగు కిటికీలు, ఒక గీజర్ స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం పోలీస్ కస్టడీలో ఉన్న అనుమానితులను కోర్టులో హాజరుపరచనున్నట్లు అధికారులు తెలిపారు.