కులం తెలియని వారు కులగణన గురించి మాట్లాడుతున్నారు
రాహుల్ గాంధీని ఉద్ధేశించి అనురాగ్ ఠాకూర్ పరోక్ష వ్యాఖ్యలు
న్యూఢిల్లీ, జూలై 30 : లోక్‌సభలో కేంద్ర బడ్జెట్‌పై చర్చ సందర్భంగా బీజేపీ నేత అనురాగ్ ఠాకూర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ‘కొంతమందిని కుల గణన అనే దెయ్యం వెంటాడుతోంది. కులం తెలియని వారు కూడా కుల గణన గురించి మాట్లాడుతున్నారు. ఈ సభలోనే మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ ఓబీసీల రిజర్వేషన్లను వ్యతిరేకించారు’ అని అనురాగ్ ఠాకూర్ అన్నార.
ఈ వ్యాఖ్యలపై అనురాగ్ ఠాకూర్ విపక్ష నేత రాహుల్ గాంధీకి వెంటనే క్షమాపణ చెప్పాలని విపక్ష సభ్యులు డిమాండ్ చేశారు. దీంతో రాహుల్ గాంధీ మనసు నొచ్చుకుంటే ఆయనకు క్షమాపణ చెప్పడంలో నాకు ఎటువంటి అభ్యంతరం లేదని అన్నారు. ఈ వ్యాఖ్యలపై రాహుల్ స్పందిస్తూ.. అనురాగ్ తనను అవమానించారని, దుర్భాషలాడారని ఆరోపించారు. అనురాగ్ క్షమాపణలు తనకు అక్కర్లేదని, వెనుకబడిన వర్గాల సమస్యలను ఎవరు లేవనెత్తినా బీజేపీ నేతలు టార్గెట్ చేస్తున్నారని మండిపడ్డారు.