calender_icon.png 6 February, 2025 | 4:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కులగణనను సరిచేయాల్సిందే

06-02-2025 01:02:15 AM

  1. లేదంటే తీవ్ర పరిణామాలు..
  2. రాష్ట్ర ప్రభుత్వానికి అంతిమ గడియలు దగ్గరపడ్డట్టే!
  3. బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ 

హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 5 (విజయక్రాంతి): రాష్ట్రంలో తప్పుల తడకగా నిర్వహించిన బీసీల కులగణన సరి చేయకుంటే రేవంత్‌రెడ్డి ప్రభుత్వం తీవ్ర పరిణా మాలు ఎదుర్కోవాల్సి వస్తోందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ హెచ్చరించారు.

తప్పుడు సర్వే లు చేయించిన కాంగ్రెస్ ప్రభుత్వానికి అంతిమ గడియలు దగ్గర పడ్డట్టేనంటూ విరుచుకుపడ్డారు. బుధవారం లక్డీకపూల్‌లో బీసీ సంఘాల నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. 2023 ఎన్నికల మ్యానిఫెస్టో ప్రకారం 42 శాతం రిజర్వేషన్లు పెంచు తానని కామారెడ్డి డిక్లరేషన్‌తో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చి బీసీలను పచ్చి మోసం చేసిందని తీవ్రంగా విమర్శించారు.

రాష్ట్ర ప్రభుత్వం కుట్రపూరితంగానే కులగణనలో బీసీల జనాభా తక్కువ చేసి చూపించడాన్ని తీవ్రంగా తప్పు బట్టారు. ప్రొ.జయశంకర్, శ్రీకాంత చారి, స్వామి గౌడ్ వంటి బీసీల త్యాగాలతో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం జరిగిందన్నారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో జానాభా దామాషా ప్రకారం 42 శాతం రాజకీయ రిజర్వేషన్లు కల్పిస్తామని కామారెడ్డి డిక్లరేషన్‌లో ప్రకటించి ఇప్పుడేమో పార్లమెంటులో చట్టం కావాలని కాకమ్మ కథలు చెబుతూ బీసీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

బీసీలను నడిరోడ్డున పడేస్తారా?

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కాంగ్రె స్ పార్టీ ఇస్తుందంటూ గాంధీ భవన్‌లో చెప్పాల్సిన మాటను అసెంబ్లీలో చెప్పి బీసీలను నడిరోడ్డులో పడేస్తారా అంటూ ఆవేద న వ్యక్తం చేశారు. కులగణన నివేదిక వచ్చిన అనంతరం బీసీ మేధావులతో ఎందుకు చ ర్చించలేదంటూ నిలదీశారు. అసెంబ్లీలో కేవ లం హాఫ్(ఒక్కపూట)డే మాత్రమే చర్చిస్తారా? బీసీల పట్ల ప్రభుత్వానికున్న చిత్తశుద్ది ఇదేనా అంటూ ద్వజమెత్తారు.

ఐసీయూలో ఉన్న కాంగ్రెస్ పార్టీని బీసీ, ఎస్సీ, ఎస్టీలు తమ భుజాల మీద మోస్తే.. చివరకు గుడికి, బడికి చైర్మన్ ను రెడ్లకు పదవులు కట్టబెడతారా అంటూ చురకలంటించారు.  సీఎం పేషీలో ఒక్క బీసీ అధికారి కూడా ఎందుకు లేరని ప్రశ్నించారు. గత ఎన్నికల్లో బీఆర్‌ఎస్, బీజేపీ కంటే కాంగ్రెస్ పార్టీ బీసీలకు తక్కువ సీట్లు ఇచ్చిందని ఆరోపించారు.

మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలకు 34 సీట్లు ఇవ్వాల్సింది పోయి 19 సీట్లు మాత్రమే ఇచ్చారని దుయ్యబట్టారు. ప్రస్తుత కులగణనలో 100 శాతం కుట్ర పూరితంగానే జరిగిందన్నారు. త్వరలో స్థానిక ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి మసి పూసి మారేడు కాయ చేయాలని చూస్తున్నారని వెల్లడించారు. ఓసీల జనాభా పెరిగి.. బీసీ, ఎస్సీ, ఎస్టీల జనాభా ఎలా తగ్గుతుందని నిలదీశారు.

రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే కులగణనలో జరిగిన తప్పులను సరి చేయాలని.. లేదంటే కాంగ్రెస్ పార్టీ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ఆయన హెచ్చరించారు. సమావేశంలో  రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు, బీసీ మేధావుల ఫోరం నాయకులు, మాజీ ఐఏఎస్ అధికారి చిరంజీవులు, ఎంబీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ తాడూరి శ్రీనివాస్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కుల్కచర్ల శ్రీనివాస్ ముదిరాజ్, బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ కుందారపు గణేశ్ ఆచారి, బీసీ యువజన సంఘం జాతీయ అధ్యక్షులు కనకాల శ్యామ్ కురుమ, మహిళా అధ్యక్షురాలు మణి మంజరి, సింగం నాగేష్, శ్రీనివాస్ పాల్గొన్నారు.