calender_icon.png 27 November, 2024 | 4:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎమ్మెల్సీ కవితపై కేసు రాజకీయ కుట్రే

18-05-2024 01:19:17 AM

బీఆర్‌ఎస్ నేత ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్

హైదరాబాద్, మే 17 (విజయక్రాంతి): కేవలం రాజకీయ దురుద్దేశంతోనే ఎమ్మెల్సీ కవితపై కేసు పెట్టారని, ఆమె ధైర్యంగా ఉన్నారని బీఆర్‌ఎస్ నేత ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. న్యాయవాదికి నోటీసులు ఇవ్వకుండానే జైలులో ఉన్న కవితను సీబీఐ అరెస్టు చేసిందంటే పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో అర్థం చేసుకోవచ్చని పేర్కొన్నారు. రౌస్ అవెన్యూ కోర్టులో బెయిల్‌పై విచారణ జరుగుతుండగా రాత్రికిరాత్రి జడ్జిని మార్చారంటే ఏవిధంగా వేధించాలని ప్రయత్నిస్తున్నారో ప్రజలు ఆలోచించాలని చెప్పారు. శుక్రవారం ఢిల్లీలోని తీహార్ జైల్‌లో కవితను మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్‌తో కలిసి ప్రవీణ్‌కుమార్ ములాఖత్ అయ్యారు.

అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ.. ఏరాష్ట్రమైనా, దేశమైనా ఆదా యం పెంచుకోవడానికి రకరకాల పాలసీలు చేస్తుంటాయని, ఈ క్రమంలో ఆదాయం పెంచుకోవడానికి ఢిల్లీ ప్రభుత్వం లిక్కర్ పాలసీ తీసుకొచ్చిందని, ఆ పాలసీల అమలులో పాల్గొ న్న ప్రతి ఒక్కరూ నేరస్థులైతే కేంద్ర ప్రభుత్వం కూడా నేరం చేసినట్టే అవుతుందని చెప్పారు. ప్రధాని మోదీ ఎవరి ప్రయోజనాల కోసం రైతు చట్టాలు తీసుకొచ్చారని, మోదీని కూడా అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.

ఈకేసులో డబ్బులు ఎక్కడా దొరక లేదని, దర్యాప్తు సంస్థలు ఆరోపిస్తున్న రూ.100 కోట్లు ఎక్కడ ఉన్నాయని, డబ్బు స్వాధీనం చేసుకోకుండా వ్యక్తిని ఏవిధంగా అరెస్టు చేస్తారని ప్రశ్నించారు. అన్ని వ్యవస్థలను తన నియంత్రణలో ఉంచుకుని ప్రధాని మోదీ ప్రతిపక్షాల గొంతు నొక్కే కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. బాల్క సుమన్ మాట్లాడుతూ.. కేసీఆర్‌తోపాటు బీఆర్‌ఎస్ పార్టీ నాయకులకు ఇలాంటి కేసులతో బెదిరిస్తామనుకుంటే అది భ్రమే అవుతుందని పేర్కొన్నారు.