calender_icon.png 11 October, 2024 | 10:49 AM

చేకుంటల్లో దోకుంటల కబ్జా!

04-09-2024 12:17:43 AM

  1. చేగుంటలో కుంటలను మింగిన ఘనులు 
  2. అధికారం అడ్డుపెట్టుకొని ఆక్రమణ 
  3. ఒత్తిళ్లతో అధికారులు సైలెంట్

చేగుంట, సెప్టెంబర్ 3 : ఆరు కుంటల కలయిక ప్రాంతమే నేడు పిలవబడుతున్న చేగుంట. గతంలో ఈ ప్రాంతాన్ని ‘చే’కుంటగా పిలిచేవారు. వాడుకలో చేగుంటగా మారిపోయింది. చేగుంటలో కుమ్మరికుంట, మామిడి కుంట, సింగారికుంట, కాకుల కుంట, ఊళ్లేన్‌కుంట, గౌకుంట అనే ఆరు కుంటలు ఉన్నా యి. ఈ కుంటలు వర్షం పడినప్పుడు నిండితే వీటికింద గతం లో పంటలు పండించేవారు. గ్రామం మండలంగా మారిపోవడం, జనాభా పెరిగిపోవడంతో ఆవాసాలు పెరిగిపోయాయి. అంతేగా కుం డా జాతీయ రహదారి పై ఉండడంతో ఇక్కడి భూములకు రెక్కలొచ్చా యి. అయితే ఆరు కుంటల్లో ప్రస్తుతం రెండు కుంటలను అక్రమార్కులు కబ్జా చేశారు. జాతీయ రహదారి 44కు ఆనుకుని ఉన్న కుమ్మరికుంట, సింగారికుంటలో అక్రమ నిర్మాణాలు చేపట్టారు. 

గుట్టు చప్పుడు కాకుండా కబ్జా..

చేగుంటలోని జాతీయ రహదారికి ఆనుకొని సర్వే నంబర్ 81లో ఉన్న కుమ్మరికుంట విస్తీర్ణం 6.28 ఎకరాలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇందులో 3.17 ఎకరాలు శిఖం భూమి ఉంది. అయితే ఈ కుంటలో గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ఆ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధి ఏకంగా 20 గుంటలను కబ్జా చేసినట్లు ఆరోపణలు ఉన్నా యి. తాను కబ్జా చేసి స్థలానికి దర్జాగా కంచె కూడా వేసుకున్నారు. అలాగే ఇదే కుంటలో మరో వ్యక్తి ఏకంగా 400 గజాల వరకు కబ్జా చేసి భవనాన్ని నిర్మించాడు. ఎవరికీ అనుమానం రాకుండా అక్కడ చిన్న గుడిని ఏర్పాటు చేశాడు. కుమ్మరికుంటలో కబ్జా జరిగిన విషయాన్ని పలువురు అధికారులకు ఫిర్యాదు చేయడంతో భవనం నిర్మించిన వ్యక్తికి 2020 లో నోటీసులు జారీ చేశారు.

అయితే అప్పటి అధికార పార్టీకి చెందిన నేతలే కబ్జా చేయడంతో ఒత్తిడి వల్ల ఎలాంటి చర్యలు తీసుకోలేదు. వీరు కబ్జా చేసిన స్థలం ప్రస్తుతం కోట్ల లో పలుకుతుంది. అలాగే సర్వే నంబర్ 314లో ఉన్న సింగారికుంట విస్తీర్ణం 2.33 ఎకరాలు ఉంది. గతంలో పోలీసులకు లొంగిపో యిన ఓ మాజీ నక్సలైట్‌కు వంద గజాల స్థ లం ప్రభుత్వం ఇవ్వగా ఇదే అదనుగా భావించిన అతను మరో 300 గజాల స్థలాన్ని ఆక్రమించి నిర్మాణం చేపట్టినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.

ఈ విషయంలో కూడా పలు వురు ఫిర్యాదు చేసినా రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం. కుమ్మరికుంట, సింగారికుంట కబ్జాలకు గురికావడంతో వర్షాకాలంలో ఈ కుంటలు నిండితే నీరంతా తమ ఇండ్ల ముందు నిండిపోతుందని చేగుంట ఎస్సీ కాలనీవాసులు వాపోతున్నారు. వరద కాలనీని ముంచుతుందని, దీంతో పాములు, తేళ్లతో సావాసం చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. 

కచ్చితంగా చర్యలు తీసుకుంటాం..

కుమ్మరికుంట, సింగారికుంటపై సర్వే చేసి కబ్జా చేసినట్లుగా నిర్ధారణ అయితే తప్పకుండా చర్యలు తీసుకుంటాం. తాను ఇటీవలే బదిలీపై వచ్చానని, పూర్తి సమాచారం తీసుకొని కుంటలు కబ్జాకు గురైతే నోటీసులు ఇస్తాం.

 -సి.నారాయణ, తహసీల్దార్, చేగుంట