calender_icon.png 6 October, 2024 | 6:04 PM

కాల్వను పూడ్చి, దారి మళ్లించారు

06-10-2024 12:08:45 AM

సర్వే నంబర్ 118/పిలో అక్రమాలు నిజమే

నిగ్గు తేల్చిన అధికారుల కమిటీ నివేదిక

ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి 

జడ్చర్ల, అక్టోబర్ 5: జడ్చర్ల నియోజకవర్గం బాలానగర్ మండల కేంద్రంలోని సర్వే నంబర్ 118/పి భూమిలో అక్రమాలు జరిగింది వాస్తవమని ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి స్పష్టం చేశారు. ఈ భూమికి సంబంధించి శనివారం ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి వివరాలు వెల్ల డించారు.

శ్రీ వారాహి ఇన్ ఫ్రా అండ్ డెవలపర్స్ సంస్థ చెరువు కాల్వను పూడ్చి వేయడంతో పాటు, స్మశానాన్ని ధ్వంసం చేసిదం టూ ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి చేసిన ఫిర్యాదుపై కలెక్టర్ నలుగురు అధికారులతో విచారణ కమిటీని నియమించారు. ఆ కమిటీ మే నెలలో క్షేత్ర స్థాయిలో పరిశీలన చేసింది.

ఈ కమిటీ సమర్పించిన నివేదిక ప్రకారం బయటి ప్రాంతాల నుంచి లక్షా 67 వేల 396 మెట్రిక్ టన్నుల మట్టిని తీసుకొచ్చి కాల్వను పూడ్చారని ఎమ్మెల్యే తెలిపారు. 2.20 ఎకరాల విస్తీర్ణంలో స్మశానం ఉండగా దాన్ని కూడా ధ్వంసం చేశారని నివేదికలో తేలిందన్నారు.

సంస్థకు సహకరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని అనిరుధ్‌రెడ్డి ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేశారు. చీఫ్ సెక్రటరీకి కూడా ఫిర్యాదు చేయనున్నట్లు వెల్లడించారు. స.న.118/పి లో ఇచ్చిన ఎన్‌ఓసీని రద్దు చేసి, పూడ్చి వేసిన కాల్వను తవ్వించాలని, ధ్వంసం చేసిన స్మశాన భూమిని పరిరక్షించాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు.