calender_icon.png 18 November, 2024 | 10:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గణన సరే.. రాజ్యాంగ సవరణ ఎలా?

07-11-2024 12:00:00 AM

రాష్ట్రంలో చేపడుతున్న కులగణన అంశం రోజుకో మలుపు తిరుగుతున్నది. దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న కులగణన అంశానికి కాంగ్రెస్ ప్రభుత్వం తెర దించింది. కులగణన చేపట్టేందుకు అసెంబ్లీలో తీర్మానం చేయడంతోపాటు రూ.150 కోట్లు కూడా విడుదల చేసింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులూ జారీ అయ్యాయి. కులగణన చేయడమే లక్ష్యంగా నూతన బీసీ కమిషన్‌ను కూడా నియమించింది. ప్రణాళిక శాఖ ఆధ్వర్యంలో కుటుంబ సర్వేనూ ప్రారంభించింది.

అంతా సజావుగా సాగుతున్న క్రమంలో కులగణనను బీసీ కమిషన్ పర్యవేక్షణలో కాకుండా ప్రత్యేక కమిషన్ ఆధ్వర్యంలో చేపట్టాలని హైకోర్టు ఆదేశించడంతో ప్రభుత్వం వెంటనే స్పందించింది. ఈ మేరకు ‘డెడికేటెడ్ కమిషన్’ను కూడా నియమించింది. ఈనెల 30వ తేదీలోగా సామాజిక, ఆర్థిక, ఉద్యోగ, విద్య రంగాల్లో బీసీల వెనుకబాటుతనంపై నివేదిక సిద్ధం చేసి ప్రభుత్వానికి సమర్పించాలని సూచించింది. కులగణనపై రాష్ట్ర ప్రభుత్వం చూపుతున్న చొరవ హర్షించదగ్గ పరిణామమే. అయితే, దీనితో స్థానిక సంస్థల్లో బీసీలు కోరుకుంటున్న రిజర్వేషన్లు సాధించేందుకు అవకాశం లభిస్తుందా? అని అనుమానాలు రేకిత్తిస్తున్నాయి. 

సవరణ జరగకుండా సాధ్యమా?

బీసీల రిజర్వేషన్ల అంశంలో అనుమానాలకు కారణం లేకపోలేదు. రిజర్వేషన్లకు సంబంధించి 50 శాతానికి మించకూడదనే పరిమితి ఉంది. దీనిని అతిక్రమించ కూడదని ఇప్పటికే సుప్రీంకోర్టు కూడా తీర్పు ఇచ్చింది. 10 శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఉంది. తెలంగాణ విషయానికి వస్తే మొత్తం 60 శాతం రిజర్వేషన్లలో 10 శాతం ఈడబ్ల్యూఎస్, ఎస్సీలకు 18 శాతం, ఎస్టీలకు 10 శాతం పోను, బీసీలకు మిగిలింది కేవలం 22 శాతమే. బీసీలు కోరుకుంటున్నట్టు 42 శాతమో లేక జనాభా దామాషా ప్రకారమో రిజర్వేషన్లు అమలు కావాలంటే 50 శాతానికే పరిమితమైన రిజర్వేషన్ల నిబంధనను సవరించాలి.

రాజ్యాంగ సవరణ చేయకుండా కులగణన విజయవంతంగా పూర్తి చేసినా రిజర్వేషన్లు పెంచేందుకు అవకాశం లేదు. రిజర్వేషన్ల అంశంలో న్యాయస్థానాల జోక్యం లేకుండా బీసీలకు రిజర్వేషన్లు పెరగాలంటే రాజ్యాంగ సవరణ తప్పనిసరిగా జరిగితీరాలి. 

ఎస్సీ, ఎస్టీలకే దామాషా ప్రకారం

వాస్తవానికి 1992లో స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లపై 73వ, 74వ రాజ్యాంగ సవరణలు జరిగాయి. ఆ సమయంలో చేసిన సవరణలో భాగంగా ఎస్సీ, ఎస్టీలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు అమలు చేయాలని సవరించారు. కానీ, బీసీలకు ఆ నిబంధన వర్తించలేదు. ఎందుకంటే, ఆ సవరణల్లో బీసీలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు అమలు చేయాలని ప్రస్తావించలేదు. దీంతో ఎస్సీ, ఎస్టీలు పొందుతున్నట్టుగా జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు పొందే అవకాశాన్ని బీసీలు కొల్పోయారు.

ఈ నేపథ్యంలో ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న కులగణన తర్వాత కూడా రాజ్యాంగ సవరణ చేయకుండా బీసీలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు సాధ్యం కావడంపై పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. 

కేంద్ర వైఖరిపై అనుమానం

బీసీలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు అమలు కావాలంటే ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే కులగణనను కేంద్ర ప్రభుత్వం ఆమోదించాలి. తర్వాత ఆ మేరకు పార్లమెంట్‌లో రాజ్యాంగ సవరణ జరపాలి. అయితే, వచ్చే ఏడాదిలో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా కులగణన చేపట్టేందుకు కసరత్తు చేస్తున్నది. ఈ తరుణంలో ప్రస్తుత కులగణనను కేంద్రం ఆమోదిస్తుందా? అనే విషయంలో అనుమానం కలుగుతుంది. రాబోయే రోజుల్లో కేంద్రమే కులగణన చేపడుతున్న కారణంగా, ఉన్న ఫలంగా పార్లమెంట్‌లో రాజ్యాంగాన్ని సవరించి తెలంగాణలో బీసీలకు స్థానిక సంస్థల్లో జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లను అమలు చేస్తుందా? అని కొందరు అభిప్రాయపడుతున్నారు.

స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు పెంచాలంటే తమిళనాడు లాగా ఈ అంశాన్ని 9వ షెడ్యూల్ చేర్చడం ద్వారా దీనికొక పరిష్కారం చూపాలి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వైఖరిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. 

తమిళనాడు తప్ప మరెక్కడా లేదు

బీసీలకు 50 శాతం రిజర్వేషన్‌ను కేవలం తమిళనాడు తప్ప దేశంలో మరే ఇతర రాష్ట్రమూ అమలు చేయడం లేదు. దీని కోసం 1993లో అప్పటి తమిళనాడు సీఎం అయిన జయలలిత అసెంబ్లీలో ప్రత్యేకంగా బిల్లును ప్రవేశపెట్టారు. అనంతరం కేంద్ర ప్రభుత్వంతో పోరాడి ప్రధానమంత్రి, రాష్ట్రపతిని ఒప్పించి బీసీల రిజర్వేషన్ అంశాన్ని ప్రత్యేకంగా 9వ షెడ్యూల్‌లో చేర్చేందుకు కృషి చేశారు. తద్వారా బీసీలకు 50 శాతం రిజర్వేషన్ అమలు అయ్యేటట్టు చేశారు.

దీంతోపాటు తమిళనాడు రాష్ట్రం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్‌ను కూడా అమలు చేయడం లేదు. దీనికి ప్రధాన కారణం తమిళనాడులో మెజార్టీ బీసీలే ఉన్నారు. తమిళనాడులో లాగా తెలంగాణలోనూ 60 శాతానికి పైగా బీసీలే ఉన్నారు. కానీ, తెలంగాణలో మాత్రం జనాభా దామాషా ప్రకారం వారికి రిజర్వేషన్లు అమలు కావడం లేదు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కులగణన చేయడంతోపాటు కేంద్ర ప్రభుత్వమూ ప్రత్యేక చొరవ చూపించి, రాజ్యాంగ సవరణ చేస్తేనే మన బీసీల రిజర్వేషన్ లక్ష్యం నెరవేరుతుందని మేధావులు అభిప్రాయ పడుతున్నారు. తమిళనాడు మోడల్‌ను అనుసరించాలని వారు సూచిస్తున్నారు. 

బీసీల లెక్కెంతో...

ప్రస్తుతం రాష్ట్రంలో చేపడుతున్న సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, కుల సర్వే, డెడికేటెడ్ కమిషన్ నివేదికతో తెలంగాణలోని కులాల సంఖ్య, వారి పర్సేంటేజీలు తెలుస్తాయి. ముఖ్యంగా బీసీల జనాభా శాతంతోపాటు రిజర్వేషన్లతో అధిక ప్రయోజనం పొందుతున్న ఓసీ జనాభా శాతమూ వెల్లడవుతుంది. వాస్తవానికి రాష్ట్రంలో ఓసీల జనాభా తక్కువగా ఉండటంతో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను సవాల్ చేసేందుకు అవకాశం లభిస్తుంది. ఆయా వర్గాల జనాభా సంఖ్య తెలియడంతో బీసీలకు జరుగుతున్న అన్యాయంపై వారిలో చైతన్యం కల్పించేందుకు ఈ సర్వే ఎంతో ఉపయోగపడుతుందని నిపుణులు, మేధావులు అభిప్రాయపడుతున్నారు. 

ఆయా రాష్ట్రాల్లో రిజర్వేషన్లు

దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో అమలు చేస్తున్న రిజర్వేషన్లు ఒకే విధంగా లేకపోవడాన్ని గమనించవచ్చు. ప్రజల అవసరాలకు అనుగుణంగా వారి వారి రాష్ట్రాలలో రిజర్వేషన్లను అమలు చేస్తున్నారు. అందులో ఏపీలో 10 శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్‌తో కలిపి మొత్తం 60.5 శాతం రిజర్వేషన్లు అమలులో ఉంది. బీహార్‌లో మొత్తం 75 శాతం రిజర్వేషన్ ఉండగా, అందులో ఓబీసీలకు 43 శాతంగా ఉంది. ఛత్తీస్‌గఢ్‌లో 69 శాతంగా ఉండగా, గుజరాత్‌లో ఈడబ్ల్యూఎస్‌తో కలిపి 58 శాతం, కర్ణాటకలో మొత్తం 66 శాతం కాగా, ఓబీసీలకు 32 శాతంగా ఉంది. కేరళలో మొత్తం 60 శాతం ఉండగా, ఓబీసీలకు 40 శాతం రిజర్వేషన్ ఉంది.

మహారాష్ట్రలో మొత్తం 73 శాతం ఉండగా అందులో మరాఠీలకు ప్రత్యేకంగా 10 శాతం రిజర్వేషన్ ఉంది. రాజస్థాన్‌లో మొత్తం 69 శాతం ఉండగా ఓబీసీ, ఎంబీసీలకు కలిపి 27 శాతంగా ఉంది. పశ్చిమ బెంగాల్‌లో 55 శాతం రిజర్వేషన్ అమలులో ఉంది. తమిళనాడులో మొత్తం 69 శాతం ఉండగా, ఓబీసీలకు 50 శాతంగా ఉంది. తెలంగాణలో ఈడబ్ల్యూస్‌తో కలిపి మొత్తం 60 శాతం రిజర్వేషన్లు అమలవుతున్నాయి. అయితే కేరళ, రాజస్థాన్, తమిళనాడు రాష్ట్రాల్లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్‌ను అమలు చేయకపోవడం గమనార్హం. 

- వ్యాసకర్త సెల్: 9866652040