calender_icon.png 29 November, 2024 | 5:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రయాణికులపై ఆర్టీసీ చార్జీల భారం దుర్మార్గం

15-10-2024 02:52:21 AM

  1. పాత్రికేయుడు పాశం, న్యాయనిపుణుడు ‘మాడభూషి’పై సీఎం సెక్యూరిటీ దాడి హేయం
  2. మాజీ మంత్రి హరీశ్‌రావు 

హైదరాబాద్, అక్టోబర్ 14 (విజయక్రాంతి): దసరాకు సొంతూళ్లకు వెళ్లి వస్తున్న పేద, మధ్యతరగతి ప్రయాణికుల ముక్కుపిండి ఆర్టీసీ అదనపు చార్జీలు వసూలు చేయడం దుర్మార్గమని మాజీ మంత్రి హరీశ్‌రావు సోమవారం ‘ఎక్స్’లో పేర్కొన్నారు.

హైదరాబాద్‌లోని జూబ్లీ బస్ స్టేషన్ (జేబీఎస్) నుంచి సిద్దిపేటకు టికెట్ ధర రూ.140 ఉండగా, యాజమాన్యం తిరుగు ప్రయాణంలో ఏకంగా రూ.200కు పెంచడం దారుణమన్నారు. హనుమకొండ నుంచి హైదరాబాద్‌కు సూపర్ లగ్జరీ చార్జీ సాధారణ రోజుల్లో రూ.300 ఉంటుందని, కానీ పండుగ తర్వాత అక్కడి నుంచి తిరిగివచ్చే వారి నుంచి ఆర్టీసీ రూ.420 వసూలు చేసిందన్నారు.

‘ప్రజాపాలన అంటే ఇదేనా?’ అని ప్రశ్నించారు. అలాగే నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ఇటీవల హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆధ్వర్యంలో జరిగిన ‘అలయ్ బలయ్’కు వెళ్లిన సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి, న్యాయ కోవిదుడు మాడభూషి శ్రీధర్‌పై సీఎం సెక్యూరిటీ దాడికి పాల్పడటం హేయమైన చర్య అని  మండిపడ్డారు.

గర్భిణులకు సత్వర వైద్యసేవలు అందేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశా రు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ ఏరియా ఆస్పత్రిలో గైనకాలజిస్టు, ఎనస్తీషియా నిపుణుడు లేక గర్భిణులకు సరైన వైద్యసేవలు అందడం లేదని వాపోయారు. గర్భిణుల అవస్థలకు సంబంధించిన ఫొటోలను సోమవారం ఆయన ‘ఎక్స్’ ద్వారా షేర్ చేశారు.