calender_icon.png 2 February, 2025 | 10:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అప్పుల బాధ ఆయువు తీసింది

02-02-2025 01:54:03 AM

* కుటుంబంతో కలిసి యువరైతు ఆత్మహత్యాయత్నం

* బావమరదలు మృతి

* చికిత్స పొందుతున్న భార్య, కూతురు

ఆదిలాబాద్, ఫిబ్రవరి 1 (విజయక్రాంతి): అప్పుల బాధతో ఓ యువరైతు కుటుంబంతో సహా ఆత్యహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ విషాదకర ఘటనలో బావమరదలు మృతి చెందగా, యువరైతు భార్య, కూతురు చికిత్స పొందుతున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో ఈ ఘటన కలకలం రేపింది.

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం తాంసిమం  కప్పర్ల గ్రామానికి చెందిన ఆకుల రాజేశ్ (35) వ్యవసాయంతో పాటు ఫెర్టిలైజర్ వ్యాపారం చేస్తున్నాడు. చేసిన అప్పులు తీర్చలేననే బెంగతో పాటు తాను అప్పు ఇచ్చిన వారు డబ్బులు తిరిగి ఇవడం లేదని మనస్థాపం చెందాడు. కుటుంబ సభ్యులందరు కలిసి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.

ఈ నేపథ్యంలోనే తన భార్య లావణ్య, కూతురు ప్రశంస, మేన మరదలు స్పందన(17) తో కలిసి శనివారం తలమడుగు మండలం ఉండం గ్రామ శివారులోని తమ పంటచేను వద్దకువెళ్లారు. ముందుగా రాకేశ్ పురుగుల మందు తాగాడు. అనంతరం మరదలు స్పందన తాగింది. అందులో మిగిలిన కొంచెం మందును భార్య లావణ్య, కూతురు ప్రశంస తాగారు.

గమనించిన స్థానికులు వారిని రిమ్స్ ఆసుపత్రికి తరలించగా రాకేశ్, అతడి మరదలు స్పందన అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుడి భార్య, కూతురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు. విషయం తెలుసుకున్న బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్, మాజీమంత్రి జోగు రామన్న రిమ్స్‌కు వెళ్లి మృతదేహాలను పరిశీలించి, ఆత్మహత్యకు గల కారణాలను మృతుడి కుటుంబసభ్యులను అడిగి తెలుసుకున్నారు.