calender_icon.png 1 November, 2024 | 3:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహిళ కాలిలోకి దూసుకెళ్లిన బుల్లెట్

31-07-2024 02:51:13 AM

  1. నార్సింగి పీఎస్ పరిధి బైరాగిగూడలో ఘటన 
  2. ఆర్మీ జవాన్లు ఫైరింగ్ సాధన చేస్తుండగా మిస్‌ఫైర్ అయినట్లు అనుమానం

రాజేంద్రనగర్, జూలై 30: ఆర్మీ జవాన్లు ఫైరింగ్ సాధన చేస్తుండగా ఓ బుల్లెట్ మిస్ ఫైర్ అయింది. దీంతో ఇంటి గుమ్మం బయట బట్టలు ఆరేస్తున్న ఓ మహిళ కాలులోంచి బుల్లెట్ దూసుకెళ్లింది. ఈ ఘటన నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని గంధంగూడలో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసులు, బాధితురాలి కథనం ప్రకారం.. బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి బైరాగిగూడలోని విజయనగర్ కాలనీ ఫ్లాట్ నంబర్ 71లో నివసించే కడమంచి పద్మ (34) అనే మహిళ ఉదయం 11:30 గంటల సమయంలో తన ఇంటి ఎదుట బట్టలు ఆరేస్తుంది.

అదే సమయంలో ఓ బుల్లెట్ ఆమె ఎడమ కాలులోంచి దూసుకెళ్లింది. దీంతో తీవ్ర రక్తస్రావం కావడంతో 100 నంబర్‌కు ఫోన్ చేసింది. వెంటనే నార్సింగి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఆమెను గోల్కొండ ఆసుపత్రికి తరలించారు. బాధితురాలి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. కాగా, పద్మ ఇంటి సమీపంలో ఆర్మీ ఫైరింగ్ రేంజ్ ఉండడంతో జవాన్లు ఫైరింగ్ సాధన చేస్తుండగా మిస్ ఫైర్ కావడంతో బుల్లెట్ వచ్చి ఆమె కాలుకు తగిలి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

నెలలో రెండో ఘటన.. 

కొన్నిరోజుల క్రితం ఇదే ఫైరింగ్ రేంజ్‌లో నుంచి ఓ బుల్లెట్ సమీపంలోని హైదర్షాకోట్‌లో ఉన్న ఓ ఫ్లాట్ కిటికీలోంచి దూసుకొచ్చింది. ప్రస్తుతం మహిళ కాలులోంచి బుల్లెట్ దూసుకెళ్లడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు.