calender_icon.png 18 October, 2024 | 1:21 PM

ఉగాది పచ్చడిలాంటి బడ్జెట్

25-07-2024 01:45:00 AM

2047 నాటికి దేశాన్ని ‘వికసిత్ భారత్’దిశగా తీసుకెళ్లే లక్ష్యంతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 ఆర్థిక బడ్జెట్‌లో పలు చర్యలు ప్రకటించారు. ప్రతి ఏటా పెద్ద సంఖ్యలో యువత దేశ కార్మికశక్తిలో చేరుతున్న నేపథ్యంలో మన దేశం రాబోయే ఆరేళ్ల కాలంలో 11.5 కోట్ల ఉద్యోగాలను సృష్టించాల్సిన అవసరం ఉంది. కేంద్ర బడ్జెట్ ఈ రెండు లక్ష్యాలను సాధించే దిశగా చర్యలు తీసుకోవడం ముదావహం. ఎంతో దూరదృ ష్టితో, వ్యూహాత్మకంగా రూపొందించిన ఈ చర్యలేమిటో ఓ సారి గమనిద్దాం.

అందులో మొదటగా కేంద్ర బడ్జెట్ మూలధన వ్యయాన్ని గణనీయంగా పెం చాలని ప్రతిపాదించారు. దేశ ఆర్థికాభివృద్ధికి, బ్యాంకులు, ఆర్థిక సంస్థలు తమ రుణ వితరణను గణనీయంగా పెంచుకోవడానికి ఇది చాలా అవసరం. 202425 ఆర్థిక సంవత్సరానికి మూలధన వ్యయా న్ని 11.1 శాతం అంటే రూ.11,11,111 కోట్ల కు పెంచాలని బడ్జెట్‌లో ప్రతిపాదించారు. ఇది దేశ స్థూల ఉత్పత్తి( జీడీపీ)లో 3.4 శాతం. గత బడ్జెట్‌లో ప్రతిపాదించిన రూ.9.5 లక్షల కోట్లతో పోలిస్తే ఇది 28.2 శాతం ఎక్కువ. అంతేకాదు 2000 ఆర్థి సంవత్సరం స్థాయికన్నా 20 రెట్లు ఎక్కువ. 

ఇక దేశ కార్మికుల్లో 25 శాతానికి పైగా ఉపాధి కల్పిస్తున్న సూక్ష్మ, చిన్న మధ్య తరహా పరిశ్రమల( ఎంఎస్‌ఎంఇ) రంగానికి బడ్జెట్‌లో ప్రతిపాదించిన పథకాలతో ఆ రంగానికి సులభంగా పెట్టుబడులు, నిధులు సమకూరి ఆ రంగం ఎదుగుదలకు ఎంతయినా దోహదపడతాయి. ఇక అన్నిటికన్నా ముఖ్యంగా యూనివర్సిటీలనుంచి డిగ్రీలు చేతపట్టుకుని బయటికి వచ్చి, ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న కోట్లాది నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు కల్పించడంతో పాటుగా వారి నైపుణ్యాలను మెరుగుపరిచేందుకు బడ్జెట్‌లో అనేక చర్యలు ప్రకటించారు.

దేశ అభివృర్థికాభివృద్ధికి ఇది ఎంతయినా అవసరం.  రాబో యే అయిదేళ్లలో  యువతకు 4 కోట్ల ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతో దాదాపు రూ.2 లక్షల కోట్ల వ్యయంతో ‘ఉపాధి అనుసంధాన పథకాల’ను ప్రకటించారు. కొత్తగా ఉద్యోగంలో చేరే వారితో పాటుగా అదనంగా ఉద్యోగాలు కల్పించే యాజమా న్యాలకు ప్రోత్సాహకరంగా ఉండే ఈ పథకాల వల్ల పెద్ద సంఖ్యలో ఉద్యోగ కల్పన జరిగే అవకాశ ముంది. పట్టణాభివృద్ధికి కూడా బడ్జెట్‌లో పెద్ద పీటే వేశారు.

30 లక్షలకు పైబడిన జనాభా ఉన్న నగరాల్లో మౌలిక సదుపాయాల కల్పనతో పాటుగా దాదాపు కోటి మంది పట్టణ పేదలు, మధ్య తరగతి కుటుంబాల సొంతింటి కల నెరవేర్చే దిశగా పలు చర్యలను ప్రకటించారు. పెట్టుబడులను ఆక ర్షించడంతోపాటుగా పట్టణ ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడడానికి పట్టణాభివృద్ధి కీలకమన్న అంశాన్ని ప్రభుత్వం గుర్తించిందనడానికి  ఇది నిదర్శనం.  ఇక గ్రామీణ ప్రాంతాల ప్రజల జీవన స్థితి గతులు మెరుగుపర్చడంతో పాటుగా వ్యవసాయ రంగంలో రాబడిని రెట్టింపు చేసేందుకు కూడా ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది.

ఆర్థిక క్రమశిక్షణ దిశగా..

వీటన్నిటితో పాటుగా ఆర్థిక క్రమశిక్షణ దిశగా కూడా  మోడీ ప్రభుత్వం అడుగు లు వేసింది. ప్రస్తుత ఆర్థి సంవత్సరంలో ద్రవ్య లోటును జీడీపీలో 4.9 శాతానికి, ఆ తర్వాతి ఆర్థిక సంవత్సరానికి 4.5 శాతం దిగువకు తగిచాలని కూడా లక్ష్యంగా పెట్టుకుంది.  దేశ ఆర్థిక వ్యవస్థ కు, పెట్టుబడిదారులు విశ్వాసాన్ని పెంచడానికి ఇది ఎంతయినా అవసరం. అయి తే ప్రభుత్వ వ్యయం, పెట్టుబడుల వేగం తగ్గి ఆర్థికాభివృద్ధిపై దాని ప్రభావం పడవచ్చన్న సంకేతాలు కూడా అంతర్గతంగా దీనిలో ఇమిడి ఉన్నాయి. 

 కె.ఎస్ అయ్యర్ అండ్‌కో ప్రముఖ చార్టెర్డ్ అకౌంటెట్స్ సంస్థ స్టాక్ మార్కెట్‌పై పిడుగు 

ఇవన్నీ బడ్జెట్‌లోని సానుకూల అంశాలయితే స్టాక్‌మార్కెట్‌ను ముఖ్యంగా మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టే మధ్య తరగతి వర్గాలను  తీవ్ర నిరాశకు గురి చేసిన చర్యలు కూడా బడ్జెట్‌లో ఉన్నాయి. సెక్యూరిటీల రాబడిపై పన్నుపు పెంచడం  దీనిలో ప్రధానమైనది.షార్ట్ టెర్మ్ క్యాపిటల్ గెయిన్స్ టాక్స్‌ను 15 శాతంనుంచి 20 శాతానికి, లాంగ్‌టెర్మ్ క్యాపిటల్ గెయిన్స్ టాక్స్‌ను 10నుంచి 12.5 శాతానికి పెంచారు. ఇది మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టే వారిపై తీవ్రస్థాయిలో ప్రతికూల ప్రభావం చూపుతుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. 

పన్ను చెల్లింపుదారులకు పెద్దగా ఎలాంటి స్పష్టమైన ప్రయోజనాలను ప్రకటించని బడ్జెట్ ‘మూలిగే నక్కపై తాటిపండు చందం’గా క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్‌ను పెంచిందని ఆ వర్గాలు భావిస్తున్నాయి. బహుశా గత 25  ఏళ్లలో పన్ను చెల్లింపుదారులపై అత్యంత ప్రతికూల చర్య ఇదేనని కూడా వారంటున్నారు. మొత్తంమీద బడ్జెట్‌పై మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. యువత, రైతులు, ఎంఎస్‌ఎంఇలు, విద్య, మౌలిక సదుపాయాలపై దృష్టిపెట్టినందుకు కొన్ని వర్గాలు బడ్జెట్‌ను ప్రశంసిస్తుండగా, మధ్య తరగతి అవసరాలపై దృష్టిపెట్టనందుకు, వారికి చెప్పుకోదగ్గ ప్రయోజనాలు కల్పించనందుకు మరికొన్ని వర్గాలు విమర్శిస్తున్నాయి. మొత్తంమీద నిర్మలమ్మ బడ్జెట్ తీపి చేదు కలయిక అయిన ‘ఉగాది పచ్చడి’లాగా పలు సానుకూల అంశాలతో పాటుగా కొన్ని ఆందోళనకరమైన విషయాలు కూడా ఉన్నాయనే చెప్పాలి.