calender_icon.png 21 January, 2025 | 6:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అన్నదాతను ఉన్నత స్థానంలో నిలబెట్టాలి

03-07-2024 12:30:51 AM

వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల

హైదరాబాద్, జూలై 2 (విజయక్రాంతి): అన్నదాతలను ఉన్నత స్థానంలో నిలబెట్టేందుకు వ్యవసాయ శాఖ కృషి చేయాలని వ్యవసాయ, మార్కెటింగ్, సహకార శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. మంగళవారం రాజేంద్రనగర్‌లోని తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్‌లో నూతనంగా నిర్మించిన ఇంటిగ్రేటెడ్ ల్యాబ్ క్లాంప్లెక్స్ భవన సముదాయాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ.. రాష్ట్రానికి, దేశానికే కాకుండా సమాజానికి ప్రధాన వనరుగా ఉన్న వ్యవసాయం రంగాన్ని అన్నివిధాలుగా ఆదుకోవాలనే సంకల్పంతో సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం సానుకూల నిర్ణయాలతో ముందుకు సాగుతోందని చెప్పారు. 

ఇందులో భాగంగానే రానున్న రెండు మూడు నెలల వ్యవధిలో రైతుభరోసా, రైతు రుణమాఫీ, రైతు బీమా కార్యక్రమాల ద్వారా రైతు సంక్షేమానికి సుమారు రూ.50 వేల కోట్లకుపైగా నిధులు వెచ్చించనుందని తెలిపారు. ప్రభుత్వ ఖజానాపై భారం పడుతున్నప్పటికీ రైతుల శ్రేయస్సే పరమావధిగా ప్రభుత్వం సాగు రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నదని చెప్పారు. పాత పద్ధతి ప్రకారమే రుణమాఫీ అమలు చేస్తామని స్పష్టంచేశారు. ఈ ఏడాది నుండి రైతు బీమాను సైతం అమలు చేయాలని ప్రభుత్వం పట్టుదలతో ఉందన్నారు. ప్రభుత్వ సంకల్పానికి అనుగుణంగా వ్యవసాయ శాఖ అధికారులు రైతుల ప్రయోజనాలే పరమావధిగా పనిచేయాలన్నారు.

ఆయిల్‌పామ్ సాగు దిశగా రైతులను ప్రొత్సహించాలని, స్పష్టమైన లక్ష్యాలను నిర్ధేశించుకుని వాటిని అధిగమించేలా కృషి చేయాలని కోరారు. రాష్ట్రంలో ఎక్కడ నకిలీ, నాసిరకం ఎరువులు, విత్తనాలకు ఆస్కారం లేకుండా పర్యవేక్షణ చేయాలని, రైతుల అవసరాలకు సరిపడా నిల్వలు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వ్యవసాయశాఖ కార్యదర్శి రఘనందన్‌రావు, జాయింట్ సెక్రటరీ ఉదయ్‌కుమార్, వ్యవసా యశాఖ డైరెక్టర్ గోపీ, ఉద్యావన శాఖ డైరెక్టర్ యాస్మిన్‌బాష, మార్క్‌ఫెడ్ ఎండీ సత్యనారాయణరెడ్డి పాల్గొన్నారు.