calender_icon.png 17 November, 2024 | 8:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అన్నదాత

11-11-2024 12:00:00 AM

వాలకం బిచ్చగాడిలా ఉన్నా 

పనంతా భూమీ ఆకాశంతోనే..

చినుకు పడాలి నేల తడాలి 

పంట పండాలి

ఇదే ఆలోచన తరతరాల వృత్తి కూడా! 

ఆ మట్టిచేయి తగిలితే 

నాగలి నవ్వుతుంది 

కమ్చీకర్ర పడితే రాజులా చెలరేగుతాడు 

ఎద్దులు హద్దులు లేనట్టు పని చేస్తాయి

నాలుగు గట్ల నేలపైనే 

అతడి చదువంతా సాగింది 

నలుగురికి తిండి పెట్టే పని 

భుజస్కంధాలపై పడింది 

పనిలో ప్రకృతితో యుద్ధానికి 

ఎప్పుడూ సిద్ధమే!

చినుకు పడితే ప్రకృతితో 

మాట కలుపుతాడు

నాగలి కదుపుతాడు 

భూమిని పండించేప్పుడు 

బ్రహ్మ, భగీరథుడు తానే అవుతాడు

పంట యజ్ఞం ఫలించాలంటే 

రెండు రెక్కల శ్రమ సరిపోదు 

హరిశ్చంద్రుడి కష్టాల్లా 

పెళ్ళాం పిల్లలు కూడా పాలేర్లయితేనే 

కథ కదులుతుంది 

పచ్చటి నారు తెల్లటి ముత్యాలయ్యే దాకా అంతం లేనట్టు కథ సాగుతుంది..

అతడి కష్టం మన భోజనాల బల్లపై 

పొగలు కక్కుతూ ఆకలి మంటలు 

చల్లారుస్తుంటే అతడు, 

పరివారం మాత్రం 

ఇరు సంధ్యల మధ్య చెమటోడ్చినా 

గిట్టుబాటు ధర లేక కడుపు నిండా 

తిండి లేని దుస్థితిలో ఉండటం

అతడి చెమట ముద్ద మన గొంతు 

మింగుడు పడని విషాదమే!

భీమవరపు పురుషోత్తమ్