- 100కు 99 మార్కులు వచ్చాయని సంబురాలు
- మీకొచ్చింది 543కు 99 మార్కులే
- హిందూమతాన్ని నిందించటం ఫ్యాషనైంది
- ప్రజలు మమ్మల్నే విశ్వసించారు
- చాయ్‌వాలా మూడోసారి ప్రధాని కావటం..కొందరికి మింగుడు పడటం లేదు
- రాహుల్‌పై ప్రధాని ఆగ్రహం
న్యూఢిల్లీ, జూలై 2: విపక్ష కాంగ్రెస్ పార్టీపై, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీవ్ర విమర్శలు గుప్పించారు. విపక్షాలు ప్రతి అంశాన్ని రాజకీయం చేస్తున్నాయని మండిపడ్డారు. విపక్షాలు ఎన్నిరకాలుగా అబద్ధాలు ప్రచారం చేసినా దేశ ప్రజలు బీజేపీ, ఎన్డీయే కూటమినే విశ్వసించారని, అందుకే వరుసగా మూడోసారి తమకే అధికారం ఇచ్చారని స్పష్టంచేశారు.
ఒక సాధారణ చాయ్ వాలా దేశానికి వరుసగా మూడోసారి ప్రధానిగా ఎన్నికై మొదటి ప్రధాని నెహ్రూతో సమానంగా నిలువటం కొందరికి మింగుడు పడటం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చకు లోక్‌సభలో మంగళవార మోదీ సమాధానమిచ్చారు. దాదాపు రెండు గంటలపాటు సాగిన సుదీర్ఘ ప్రసంగంలో అత్యధిక సమయం రాహుల్‌గాంధీ, కాంగ్రెస్‌పై విమర్శలకే ప్రాధాన్య మిచ్చారు.
మీకు వచ్చింది ౫౪౩కు 99 మార్కులే
లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీపై ప్రధాని మోదీ సెటైర్లు వేశారు. రాహుల్ పేరును ఉచ్చరించకుండానే విమర్శలు గుప్పించారు. మోదీ ప్రసంగం కొనసాగుతున్నంతసేపు రాహుల్ కూడా చిరునవ్వుతో వింటూ కూర్చున్నారు. ‘ఓ అబ్బాయి ఉన్నా డు. తనకు వందకు ౯౯ మార్కులు వచ్చాయని సంబరపడుతున్నాడు. కానీ, ఆయన గురువులు ఎందుకు మిఠాయిలు పంచుతున్నావు? ఎందుకు సంబురాలు చేసుకొంటు న్నావని అడిగారు. అంతగా సంబురం చేసుకోవాల్సిన అవసరం లేదు.. నీకొచ్చింది ౧౦౦కు ౯౯ మార్కులు కాదు.. ౫౪౩కు ౯౯ మార్కులని చెప్పాలని ఒక గురువు ప్రయత్నించాడు. కానీ, పిల్లల మనస్తత్వం ఉన్న ఆ బాలుడు అర్థంచేసుకొంటాడా? నిన్న (సోమవారం) మన సభలో చిన్నపిల్లల చేష్టలను చూశాం. పిల్లాడి ఏడుపులు చూశాం. ఆ పిల్ల చేష్టల వ్యక్తి బెయిల్‌పై బయట తిరుగుతున్నాడు. సానుభూతి కోసం కొత్త నాటకం మొదలుపెట్టాడు’ అని రాహుల్‌గాంధీపై విమర్శలు గుప్పించారు.
మీ సంస్కారమిదే!
రాహుల్‌గాంధీ సభలో దేవుళ్ల ఫొటోలు ప్రదర్శించటంపై ప్రధాని ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘తప్పుడు ఆరోపణలతో హిందూమ తాన్ని చెడుగా చూపించే కుట్ర జరుగుతున్నది. ఇది అతిపెద్ద కుట్ర. హిందువులు హింసావాదులని ప్రచారం చేస్తున్నారు. ఇదే మీ సంస్కారం. ఇదే మీ వ్యక్తిత్వం. ఇదే మీ ఆలోచన. ఇదే మీ విద్వేషం. ఈ ప్రచారాన్ని దేశం వందల ఏండ్ల వరకు మరిచిపోదు’ అని హెచ్చరించారు. కొందరు కుట్రదారులు హిందూ ఉగ్రవాదం అనే పదాన్ని ప్రజల్లోకి చొప్పించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. హిందూమతాన్ని విమర్శించటం ఫ్యాషనైపోయిందని ధ్వజమెత్తారు. ప్రధాని మోదీ మాట్లాడిన తర్వాత లోక్‌సభ నిరవధికంగా వాయిదా పడింది. షెడ్యూల్ కంటే ఒక రోజు ముందుగానే వాయిదా పడ్డాయి.
వెల్‌లోకి దూసుకెళ్లిన ప్రతిపక్ష ఎంపీలు..
ప్రధాని మోదీ మాట్లాడుతున్న సమయంలో ప్రతిపక్ష ఇండియా కూటమి ఎంపీలు వెల్‌లోకి దూసుకెళ్లి నిరసన తెలిపారు. మణిపూర్ ప్రజలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. నియంత పాలనను అసలు సహించేది లేదని నినాదాలు చేశారు. స్పీకర్ ఓం బిర్లా వారిని శాంతింపజేసేందుకు ప్రయత్నించినా వారు వినలేదు. మణిపూర్ ఆంశం, నీట్ పేపర్ లీకేజ్ మొదలైన సమస్యలపై ప్రధాని స్పందించాలని పట్టుబట్టారు. గందరగోళంలోనే ప్రధాని ప్రసంగం కొనసాగించారు. దీంతో స్పీకర్ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీపై సీరియస్ అయ్యారు.
వికసిత్ భారత్ వైపు అడుగులు
వికసిత్ భారత్ వైపు దేశం పయనిస్తోందని ప్రధాని మోదీ తెలిపారు. వికసిత్ భారత్ లక్ష్యాలను రాష్ట్రపతి చక్కగా వివరించారని కొనియాడారు. ఇప్పటి వరకు చాలా మంది ఎంపీలు రాష్ట్రపతి ప్రసంగం మీద తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారని, నూతన ఎంపీలు సభా నియమాలను చక్కగా పాటించారని ప్రశంసించారు.
ఎగిరిపడుతున్న యువరాజు
మీకొచ్చింది 99/543 మార్కులే
హిందూమతాన్ని నిందించటం ఫ్యాషనైంది
రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చకు లోక్‌సభలో మంగళవారం మోదీ సమాధానమిచ్చారు. దాదాపు రెండు గంటలపాటు సాగిన సుదీర్ఘ ప్రసంగంలో అత్యధిక సమయం రాహుల్‌గాంధీ, కాంగ్రెస్‌పై విమర్శలకే ప్రాధాన్యమిచ్చారు. ప్రపంచంలో పదో పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న దేశాన్ని పదేండ్ల తమ పాలనలో ఐదో స్థానానికి తీసుకెళ్లామని, ముందుముందు వికసిత్ భారత్ లక్ష్యాన్ని పూర్తిచేస్తామని ప్రకటించారు.