calender_icon.png 25 December, 2024 | 7:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కుర్రాడిదే కిరీటం

15-07-2024 12:15:00 AM

అల్కరాజ్ జయభేరి గ్రాండ్‌స్లామ్ కైవసం

గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌లో సిల్వర్‌జూబ్లీ కొట్టాలనుకున్న సెర్బియా వీరుడు నొవాక్ జొకోవిచ్ కల చెదిరింది. నిరుడు మాదిరిగానే సాగిన వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ ఫైనల్లో మరోసారి అల్కరాజ్ చేతిలో జొకో పరాజయం పాలవగా.. 21 ఏండ్లకే నాలుగో గ్రాండ్‌స్లామ్ టైటిల్ నెగ్గిన అల్కరాజ్ నయా రికార్డు నెలకొల్పాడు. ఏకపక్షంగా సాగిన తుదిపోరులో అనుభవంపై యువరక్తానిదే పైచేయి అయింది. వరుస సెట్లలో విజృంభించిన అల్కరాజ్ ముందు నిలవలేకపోయిన జొకో ఆల్‌ఇంగ్లండ్ క్లబ్‌లో రన్నరప్‌తో సరిపెట్టుకున్నాడు.

లండన్: నూనూగు మీసాల కుర్రాడు మరోసారి మెరిశాడు. సీజన్ మూడో గ్రాండ్‌స్లామ్ ప్రతిష్ఠాత్మక వింబుల్డన్ ఫైనల్లో స్పెయిన్ నయా సంచలనం కార్లోస్ అల్కరాజ్ గార్ఫియా టైటిల్ చేజిక్కించుకున్నాడు. పురుషుల సింగిల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన అల్కరాజ్ తుదిపోరులో 6 6 7 (7/4)తో నొవాక్ జొకోవిచ్ (సెర్బియా)పై విజయం సాధించాడు. నిరుడు వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ ఫైనల్లోనూ ఈ ఇద్దరే తలపడగా.. ఐదు సెట్లుగా సాగిన పోరులో అల్కరాజ్ గెలుపొందిన విషయం తెలిసిందే.

21 ఏళ్ల అల్కరాజ్‌కు ఇది నాలుగో గ్రాండ్‌స్లామ్ టైటిల్ కావడం విశేషం. యూఎస్ ఓపెన్ (2022), ఫ్రెంచ్‌ఓపెన్ (2024) గెలిచిన అల్కరాజ్.. వింబుల్డన్‌లో వరుసగా రెండు టైటిల్స్ పట్టాడు. వేల్స్ యువరాణి కేట్ విజేతకు ట్రోఫీ బహుకరించారు. నెల రోజుల క్రితం జరిగిన ఫ్రెంచ్‌ఓపెన్‌లో గాయం కారణంగా జొకోవిచ్ క్వార్టర్స్‌లో వెనుదిరగగా.. తిరుగులేని ప్రదర్శన కనబర్చిన అల్కరాజ్ టైటిల్ గెలుచుకున్నాడు. గాయం నుంచి కోలుకొని వింబుల్డన్ వరుస విజయాలతో దూసుకొచ్చిన 37 ఏళ్ల జొకోవిచ్ కెరీర్‌లో 25వ గ్రాండ్‌స్లామ్ నెగ్గి.. టెన్నిస్ చరిత్రలో అత్యధిక టైటిల్స్ గెలిచిన ప్లేయర్‌గా నిలవాలని భావించినా.. అతడి ఆశ తీరలేదు. గ్రాండ్‌స్లామ్ ఫైనల్‌కు చేరితే టైటిల్ పట్టడం ఖాయంగా సాగుతున్న అల్కరాజ్.. నాలుగుసార్లు గ్రాండ్‌స్లామ్ ఫైనల్‌కు చేరి నాలుగింట గెలవడం కొసమెరుపు.

రెండున్నర గంటల లోపు ముగిసిన తుదిపోరులో అల్కరాజ్ వరుస సెట్లలో విజృంభించాడు. తొలి రెండు సెట్లను అలవోకగా ఖాతాలో వేసుకున్న అల్కరాజ్ మూడోసెట్‌ను టైబ్రేకర్‌లో సొంతం చేసుకున్నాడు. మ్యాచ్‌లో అల్కరాజ్ 5 ఏస్‌లు కొడితే.. జొకో 8 ఏస్‌లు సంధించాడు. అయితే విన్నర్ల విషయంలో అల్కరాజ్ (42)తో పోల్చితే జొకోవిచ్ (26) వెనకబడిపోయాడు. గంటకు 200 కిలోమీటర్లకు పైగా వేగంతో సర్వీస్‌లు చేస్తూ చెలరేగిపోయిన అల్కరాజ్.. బలమైన బ్యాక్ హ్యాండ్ షాట్లతో విజృంభిస్తే.. నెట్ గేమ్‌తో ఫలితాలు రాబట్టలేక జొకో వెనుకబడిపోయాడు. మరోవైపు మహిళల డబుల్స్ ఫైనల్లో క్యాటెరినా సినైకోవా టౌన్‌సెండ్ జోడీ టైటిల్ గెలుచుకున్నారు. పురుషుల డబుల్స్‌లో హ్యారీ హెలోవారా పాటన్ జంట విజేతగా నిలిచింది.  

* 4 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ సంఖ్య. వింబుల్డన్ (2023, 2024)లో రెండుసార్లు విజేతగా నిలిచిన అల్కరాజ్.. యూఎస్ ఓపెన్ (2022), ఫ్రెంచ్ ఓపెన్ (2024)లో ఒక్కో సారి టైటిల్ పట్టాడు. తద్వారా హార్డ్ కోర్ట్‌లో 22 ఏళ్ల లోపు అత్యధిక టైటిల్స్ నెగ్గిన ప్లేయర్‌గా రికార్డుల్లోకెక్కాడు.