calender_icon.png 29 October, 2024 | 3:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వైద్యుల నిర్లక్ష్యంతో బాలుడి మృతి!

30-07-2024 12:21:41 AM

ఆస్పత్రి ఎదుట కుటుంబ సభ్యుల ఆందోళన

హనుమకొండ, జూలై 29 (విజయక్రాంతి): వైద్యుల నిర్లక్ష్యంతో బాలుడు మృతి చెందిన ఘటన హనుమకొండ జిల్లా కేంద్రంలోని బాలసముద్రంలో సోమవారం చోటుచేసుకుంది. బాధితుల కథనం ప్రకారం.. చెన్నారావుపేట మం డలం బోడ మాణిక్యం తండాకు చెందిన భూక్య మోహన్, ఉమ దంపతులు. వీరి కుమారుడు భూక్య జీవన్(12) రెండు రోజుల క్రితం అనారోగ్యానికి గురవడంతో నర్సంపేటలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. డెంగ్యూ నిర్ధారణ కావడంతో అక్కడి వైద్యుల సలహా మేరకు హనుమకొండ బాలసముద్రంలోని చక్రవర్తి ఆసుపత్రిలో చేర్పించారు.

అక్కడి వైద్యులు బాలుడిని ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో బాలుడి పరిస్థితి విషమించడంతో సోమవారం ఉదయం మృతిచెందాడు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే జీవన్ మృతి చెందాడని ఆరోపిస్తూ కుటుంబ సభ్యులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. వైద్యులు బాలుడికి ఇచ్చిన ఇంజక్షన్ వికటించి మృతి చెందాడని ఆరోపించారు. ఆసుపత్రి నిర్వాహకులు, వైద్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ జరిపి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.