calender_icon.png 23 November, 2024 | 9:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప‌ల్లెల్లో బెల్టు షాపుల జోరు..

23-11-2024 06:27:14 PM

తెల్లవారి నుంచి అర్ధరాత్రి వరకు మద్యం విక్రయాలు

విచ్చలవిడిగా దందా

పట్టించుకోని ఎక్సైజ్ అధికారులు

రామాయంపేట‌ (విజయక్రాంతి): ప‌ల్లెసీమ‌ల్లో బెల్టు షాపులు విచ్చ‌ల‌విడిగా కొన‌సాగుతున్నాయి. ఉద‌యం 5 గంట‌ల నుండి అర్ధ‌రాత్రి ఒంటి గంట వ‌ర‌కు మ‌ద్యం అమ్మ‌కాలు చేస్తూ య‌థేచ్ఛ‌గా దందాను మూడు పువ్వులు, ఆరు కాయ‌లుగా కొన‌సాగిస్తున్నారు. ఇంత జ‌రుగుతున్నా ఎక్సైజ్ అధికారులు మాత్రం నిమ్మ‌కునీరెత్త‌న‌ట్లు వ్య‌వ‌హ‌రిస్తున్నార‌నే విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ అనుమతితో నడిచే వైన్స్ షాపులు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కొనసాగుతాయి. కానీ బెల్టు షాపులకు మాత్రం జెండా పండుగ, గాంధీ జయంతి అనే తేడా లేకుండా 24 గంటలు మద్యం అమ్మకాలు జరుగుతుండడం గమనార్హం.

పట్టణ ప్రాంతాలలో వైన్సులు రాత్రి 10 గంటల వరకు మూసివేయగా బెల్టు షాపుల్లో మాత్రం ఏ మద్యం కావాల‌న్నా అర్ధరాత్రైనా తలుపు తట్టిన క్షణం ఏటీఎం లాగా కావాల్సిన మద్యం లభిస్తుంది. తాగేందుకు బుక్కెడు నీరులేని పల్లెలు ఉన్నాయి.... కానీ మందు దొరకని పల్లెలు మాత్రం ఒక్కటి లేదు. దీంతో మారుమూల గ్రామాలు మత్తులో జోగుతున్నాయి. గ్రామాల్లో పుట్టగొడుగుల బెల్టు దుకాణాలు వెలుస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా బెల్ట్ షాపులు ఏర్పాటు చేసి అధిక ధరలకు విక్రయిస్తున్నారు. అనేకమంది బెల్టు షాపుల్లో మద్యం కొనుగోలు చేసి జేబులు గుల్ల చేసుకుంటున్నారు. అప్పులు చేసి తాగడంతో కుటుంబాలు వీధిపాలవుతున్నాయి.

పేరుకే కిరణాలు... అమ్మేది మద్యం.?

రామయంపేట మండలంలోని పలు గ్రామాల్లో కొంతమంది పేరుకు కిరాణా దుకాణాలు నిర్వహిస్తూ లోపల మాత్రం మద్యం వ్యాపారం చేస్తున్నారు. మద్యం మత్తులో ఇళ్ళ మధ్యలో గొడవలు పడుతూ అర్ధరాత్రి వరకు నానారభస చేస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నా ఎవ‌రూ పట్టించుకోవడం లేదని గ్రామాల్లో మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి గ్రామంలో బెల్ట్ షాపుల కారణంగా మద్యం ఏరులై పారుతుంది.

విచ్చలవిడిగా గ్రామాల్లో దొరుకుతున్న మద్యం కారణంగా పచ్చని సంసారాల్లో చిచ్చు పెడుతుందని, గ్రామాల్లో బెల్ట్ షాపులు నిర్వహిస్తుండడంతో యువత పెడదారి పడుతున్నారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల కనుసన్నల్లోనే బెల్ట్ షాపులు? మండలాల వ్యాప్తంగా ప్రతినెల బెల్టు షాపుల ద్వారా లక్షల్లో మద్యం విక్రయాలు పోతున్నాయి. వైన్ షాపు యజమానులు ఎక్సైజ్, పోలీస్ అధికారుల అండదండలతో మండలాల్లో గ్రామ గ్రామాన బెల్ట్ షాపులు నిర్వహిస్తూ వైన్ షాపులు తలపించే విధంగా చేస్తున్నా అధికారులు చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారని ప్రజలు విమ‌ర్శిస్తున్నారు.

అధిక ధరలకు విక్రయాలు..

పట్టణాలు, మండల కేంద్రాల్లో ఉన్న మద్యం షాపుల్లో ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు విక్రయాలు జరుగుతుండగా బెల్టు షాపుల నిర్వాహకులు మాత్రం అధిక ధరలకు విక్రయించి మందుబాబుల జేబులకు చిల్లులు పెడుతున్నారు. ఎంఆర్‌పీ ధ‌ర‌కంటే అద‌నంగా రూ.10 క్వార్ట‌ర్‌కు అద‌నంగా తీసుకుంటూ దోచుకుంటున్నార‌నే ఆరోప‌ణ‌లు ఉన్నాయి. గ్రామాల్లో బెల్ట్ షాపులు తొలగించాలంటూ పలువురు మహిళలు బహిరంగంగానే నిరసన వ్యక్తం చేస్తున్నా అధికారుల్లో స్పంద‌న రావ‌డం లేద‌ని విమ‌ర్శిస్తున్నారు. కూలీనాలి చేసుకుంటూ జీవనం సాగిస్తున్న నిరుపేదలు పనిచేసి వచ్చి పట్టణానికి వెళ్లి మద్యం తాగడం ఎందుకని గతంలో ఇళ్లలో ఉండేవారు. కానీ గ్రామాల్లో బెల్ట్ షాపుల వలన కూలీ పనితో వచ్చిన డబ్బులు సగం డబ్బు మద్యానికి ఖ‌ర్చు చేస్తున్నారు. ఇప్పటికైనా ఎక్సైజ్ అధికారులు పట్టించుకోని బెల్టు షాపులను మూసివేయాలని గ్రామాలలోని ప్రజలు, మ‌హిళలు కోరుతున్నారు.