calender_icon.png 7 January, 2025 | 9:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పుస్తకాల పండుగ వచ్చేసిందోచ్!

12-12-2024 01:51:57 AM

ఈనెల 19 వరకు హైదరాబాద్ బుక్ ఫెయిర్ 

  • 210 ప్రచురణకర్తలు, 380కి పైగా స్టాల్స్ ఏర్పాటు
  • రచయితలకు ప్రత్యేక స్టాల్

  • హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 11 (విజయక్రాంతి): హైదరాబాద్ మహానగర ప్రజలను ఏటా ఓ పండుగలా పలకరించే పుస్తక మహోత్సవం బుక్ ఫెయిర్ పండుగ ఈ ఏడాది రానే వచ్చింది. ఏటా దాదాపు 10 లక్షలకుపైగా పుస్తక ప్రియులు, సాహిత్యకారులు, రచయితలు ఈ బుక్‌ఫెయిర్‌ను సందర్శిస్తుంటారు. ఈసారి బుక్ ఫెయిర్‌లో 210కి పైగా ప్రచురణకర్తలు, 320కి పైగా స్టాల్స్ ఏర్పాటు చేయనున్నారు. ఈసారి రచయితల కోసం ప్రత్యేకం గా ఓ స్టాల్ ఏర్పాటు చేస్తున్నారు.

  • ఈఏడాది ప్రత్యేకంగా ట్రాన్స్‌జెండర్ రచయితలు పాల్గొననున్నారు. డిసెంబర్ 19 వరకు కొనసాగనున్న ఈ బుక్‌ఫెయిర్‌కు ప్రముఖ రచయిత దాశరధి కృష్ణమాచార్య ప్రాంగణంగా నామకరణం చేయగా, దివంగత ప్రముఖ న్యాయవాది బొజ్జ తారకం సతీమణి, ప్రముఖ రచయిత బోయి విజయభారతి పేరును సభా కార్యక్రమాల వేదికకు,  పుస్తకావిష్కరణల వేదికకు తోపుడుబండి సాధిక్ పేరుపెట్టారు. రోజూ మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 9 గంటల దాకా బుక్‌ఫెయిర్ కొనసాగుతుందని నిర్వాహకులు వెల్లడించారు. ఈ బుక్ ఫెయిర్‌కు సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ బీ సుదర్శన్‌రెడ్డి, ఎమ్మెల్సీ 

కోదండరామ్, సీనియర్ ఎడిటర్ కే రామచంద్రమూర్తి, ప్రొరమా మేల్కోట్టే సలహాదారులుగా ఉన్నారు. బుక్ ఫెయిర్ అంటే కేవలం పుస్తకాలు అమ్మడం, కొనడం కాదనీ.. సమాజంలో పౌరులందరూ జ్ఞానవంతులుగా తీర్చిదిద్దడమే లక్ష్యం అని బుక్ ఫెయిర్ అధ్యక్షులు, ప్రముఖ కవి డాక్టర్ యాకూబ్ అన్నారు. బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో బుధవారం ఆయన మాట్లాడారు. మొత్తం 380 స్టాల్స్‌కు పైగా ఏర్పాటు చేస్తున్న ఈ ఫెయిర్‌లో 171 ఇంగ్లీషు, 168 తెలుగు, ఉర్ధూ, హిందీ స్టాల్స్ ఉంటాయన్నారు.

సమావేశంలో బుక్ ఫెయిర్ కార్యదర్శి వాసు, సొసైటీ కోశాధికారి నారాయణ రెడ్డి, ఉపాధ్యక్షులు కె.బాల్‌రెడ్డి, బి. శోభన్ బాబు, సంయుక్త కార్యదర్శులు కె.సురేష్, ఎం.సూరిబాబు, సభ్యులు జనార్దన్, విజయరావు, మధుకర్, కోటేశ్వరరావు, శ్రీకాంత్, శ్రీనివాసరావు, సాంబశివరావు, స్వరాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.