- కొన్ని రకాలకే రూ.500 బోనస్?
- ఆందోళన చెందుతున్న రైతులు
మంచిర్యాల, నవంబర్ 10 (విజయక్రాంతి): ప్రభుత్వం సన్న వడ్లకు క్వింటాలుకు రూ.500 బోనస్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఎన్నో రకాలున్న సన్న వడ్లలో కొన్నింటికి మాత్రమే బోనస్ ఇస్తారని తెలియడంతో రైతులు ఆందోళన చెందుతు న్నారు.
మంచిర్యాల జిల్లాలో ఖరీప్ సీజన్‌లో 1,52,920 ఎకరాల్లో వరి పంట సాగైనట్లు వ్యవసాయ శాఖ అధికారులు గుర్తించారు. అందులో 33 రకాలై సన్నాలకు మాత్రమే బోనస్ ఇస్తామని ప్రభుత్వం ఆ రకాలను ప్రకటించింది.
ఇందులో సిద్ది, కంపసాగర్ వరి-1, సాంబమసూరి, జగిత్యాల వరి-3, జగిత్యాల వరి-2, వరంగల్ సాంబ, వరంగల్ సన్నాలు, జగిత్యాల మసూరి, పొలాస ప్రభ, క్రిష్ణ, మానేరు సోనా, తెలంగాణ సోనా, వరంగల్ వరి-1119, కూనారం వరి-2, వరంగల్ వరి-2, రాజేంద్రనగర్ వరి- 4, కూనారం వరి-1, జగిత్యాల సన్నా లు, జగిత్యాల సాంబ, కరీంనగర్ సాంబ, అంజన, నెల్లూరు మసూరి, ప్రత్యూమ్నా, సుగంద సాంబ, శోబిని, సోమ్నాత్, ఆర్‌ఎన్‌ఆర్ 31479, కేపీఎస్ 6251, జేజీఎల్ 33124, హెచ్‌ఎంటీ సోనా, మారుటేరు సాంబ, మారుటేరు మసూరి, ఎంటీయూ 1271 మాత్రమే ఉన్నా యి.
వీటిలో ఎక్కువ శాతం రకాలు మంచిర్యాల జిల్లాలో సాగు చేయలేదు. ప్రైవేటు కంపెనీల సన్నరకం విత్తనాలనే ఎక్కువగా సాగు చేశారు. దీంతో బోనస్ వస్తుందా, రాదా అనే అయోమయంలో రైతులు పడ్డారు. మరోవైపు కొనుగోలు కేంద్రాల్లో గ్రెయిన్ కాలీపర్ పరికరం ద్వారా ధాన్యం గింజలను పరిశీలించి వెరైటీ నిర్ణయిస్తారని అధికారులు చెబుతున్నా రైతుల్లో భయం వీడటం లేదు.
జిల్లా వ్యాప్తంగా 300పై చిలుకు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఒక్కో రైతుకు చెందిన ధాన్యం రాశులను 18 మండలాల వ్యవసాయాధికారులు, 55 మంది ఏఈవోలు ఎప్పుడు పరిశీలిస్తారు, ఎంత మందికి సర్టిఫికెట్లు అందజేస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది.
ప్రతి పీపీసీకి పరికాలను అందిస్తున్నాం
జిల్లాలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలకు సన్న రకాలను గుర్తించేందుకు పరికరాలను అందిస్తున్నాం. ఒక్కో కేంద్రానికి గింజ పరిమాణం తెలుసుకునేందుకు ఒక గ్రెయిన్ కాలిపర్, ధాన్యం గింజలను ఒలిచేందుకు ప్యాడిహస్కర్, ఒక్కో కేంద్రానికి ఒక్కో ఓపీఎంఎస్ కోడ్‌లను కేటాయిస్తున్నాం. వీటి ద్వారా సన్నరకాలను వ్యవసాయాధికారులు గుర్తించనున్నారు. నాణ్యత ప్రమాణాలు కలిగిన సన్నాలకు ప్రభుత్వం అందించే బోనస్ రూ. 500 చెల్లిస్తాం.
శ్రీకళ, సివిల్ సప్లయ్ డీఎం, మంచిర్యాల
సన్నాలన్నింటికి బోనస్ ఇయ్యాలే
ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సన్న రకాలన్నింటికి ఎలాంటి కండీషన్‌లు లేకుండా బోనస్ ఇవ్వాలి. కొన్నింటికే ఇస్తామని ప్రకటిస్తే మిగితా సన్నాలు ఎక్కడ అమ్ముకోవాలే. బయటి వ్యాపారులకు అమ్ముకుందామంటే ఇదే అదనుగా ధర తగ్గించి కొనుగోలు చేస్తరు. ఎలాంటి నియమ నిబంధనలు లేకుండా ఆరిన సన్న రకం ధాన్యానికి ‘ఏ’ గ్రేడ్ కింద తీసుకుని బోనస్ రూ.500 చెల్లించాలి.
కొట్టె సురేష్, నంనూరు, హాజీపూర్
అధికారుల ఆదేశాల మేరకు సర్టిఫై చేస్తాం
గ్రెయిన్ కాలిపర్ (డయల్ మైక్రోమీటర్) యంత్రం ద్వారా సన్నరకం ధాన్యం గుర్తిస్తాం. ప్రభుత్వ ఆదేశాల మేరకు సన్న బియ్యం గింజ పొడవు, వెడల్పు కొలిచి సర్టిఫై చేస్తాం. ధాన్యం గింజ పొడువు 6 మిల్లీ మీటర్ల (ఎంఎం) కన్నా తక్కువ ఉండి, గింజ వెడల్పు 2 ఎంఎం కన్నా ఎక్కువ ఉండకుండా ఉండి, గింజ పొడవు, వెడల్పు నిష్పత్తిని తీసుకుంటే 2.5 ఎంఎం కన్నా ఎక్కువ ఉన్న వాటిని మాత్రమే సర్టిఫైడ్ చేస్తాం.
అత్తె సుధాకర్, వ్యవసాయాధికారి, భీమారం