calender_icon.png 13 October, 2024 | 3:41 PM

పత్తి తీసేందుకు వెళ్తున్న బొలెరో వాహనం బోల్తా.!

13-10-2024 01:04:10 PM

మహిళా కూలి మృతి. 

మరో 12 మందికి తీవ్ర గాయాలు. 

నాగర్ కర్నూల్ (విజయక్రాంతి): నాగర్ కర్నూల్ జిల్లాలో పండగ పూట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పత్తి తీయడానికి కూలీలతో వెళ్తున్న బొలెరో వాహనం కేఎల్ఐ కాలువలోకి ఫల్టీ కొట్టింది. దీంతో వాహనంలో ప్రయాణిస్తున్న 13 మందిలో ఒక మహిళ అక్కడికక్కడే మృతి చెందగా మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని సరస్వతీ దేవాలయం సమీపంలో ఆదివారం చోటుచేసుకుంది. బాధితులు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం నాగర్ కర్నూల్ మండలం మంతటి గ్రామానికి చెందిన 13 మంది కూలీలు సరస్వతి దేవాలయం సమీపంలోని ఒక వ్యవసాయ పొలంలో పత్తి తీయడానికి వెళ్తున్నారు. ప్రధాన రహదారి నుండి పొలంలోకి వెళ్తుండగా పక్కనే ఉన్న కేఎల్ఐ కాలువలోకి ఫల్టీ కొట్టింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న మహమ్మద్ బేగం (45) అక్కడికక్కడే మృతిచెందగా మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే 108ని ఆశ్రయించగా సిబ్బంది జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే కూచుకుల్ల రాజేష్ రెడ్డి వెంటనే ఆసుపత్రికి చేరుకుని చికిత్స పొందుతున్న క్షతగాత్రులకు పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు. ప్రమాదంలో మృతి చెందిన కుటుంబానికి అండగా ఉంటామని భరోసా కల్పించారు.