- వరుసగా రెండోసారి అండర్-19 టీ20 కప్ కైవసం
- 5 కోట్ల నజరానా ప్రకటించిన బీసీసీఐ
- టోర్నీ ఆసాంతం మెరిసిన తెలుగమ్మాయి
కౌలాలంపూర్: ప్రపంచ అండర్-19 మహిళల వరల్డ్‌కప్ ఫైనల్లో భారత అమ్మాయిలు 9 వికెట్ల తేడాతో సౌతాఫ్రికా అమ్మాయిల మీద విజయం సాధించి.. వరుసగా రెండోసారి ట్రోఫీని కైవసం చేసు కున్నారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సఫారీ అమ్మాయిలు భారత అమ్మాయిల బౌలింగ్ దెబ్బకు నిర్ణీత 20 ఓవర్లలో 82 పరుగులు మాత్రమే చేశారు.
83 పరుగుల స్వల్ప టార్గెట్‌తో బరిలోకి దిగిన భారత్ కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి 11.2 ఓవర్లలోనే లక్ష్యం చేధించింది. టోర్నీ ఆసాంతం అత్యద్భుత ప్రదర్శన చేసిన త్రిషకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు దక్కాయి.
మెరిసిన తెలంగాణ క్రీడాకారిణి
తెలంగాణ చిన్నది గొంగడి త్రిష మరోమారు ఆల్‌రౌండ్ ప్రదర్శనతో సత్తా చాటిం ది. బౌలింగ్‌లో 3 వికెట్లు తీసిన త్రిష, బ్యాటింగ్ 44* సత్తా చాటింది. ఈ టోర్నీలో త్రిష 309 పరుగులు చేయడంతో పాటు 7 వికెట్లు కూడా తీసుకుంది. అండర్-19 వర ల్డ్ కప్ గెలిచిన మహళల జట్టుకు బీసీసీఐ రూ. 5 కోట్ల నజరానాను ప్రకటించింది.
త్రిషకు అభినందల వెల్లువ
హైదరాబాద్, ఫిబ్రవరి 2(విజయక్రాం తి): అండర్-19 మహిళల ప్రపంచకప్‌ను భారత్ గెలవడంలో కీలకపాత్ర పోషించిన తెలంగాణ చిన్నది గొంగడి త్రిషకు అభినందనలు వెల్లువెత్తాయి. త్రిషను సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మంత్రులు దామోదర రాజనర్సింహ, శ్రీధర్ బాబు అభినందించారు. భవిష్యత్‌లో ఉన్నత శిఖరాల ను అధిరోహించాలని ఆకాంక్షించారు.