07-04-2025 01:33:43 AM
భద్రాచలం, ఏప్రిల్ 6: అది గౌత మీ తీరం.. దక్షిణ అయోధ్యాపురి భద్రగిరిలోని సీతారామచంద్రస్వామి ఆలయ ప్రాంగణంలోని మిథిలా మండపం.. సీతారాముల కల్యాణా న్ని కనులారా వీక్షించేందుకు వేలాది మంది భక్తులు నిరీక్షిస్తున్నారు. ముహూర్తం దగ్గర పడుతుండగా వేదపండితులు, ఆలయ సిబ్బంది పెండ్లి కొడుకుగా రామయ్య, పెండ్లి కుమార్తెగా సీతమ్మ మూలవరులను అలంకరించి పెండ్లి మండపంలోకి తీసుకొచ్చారు.
కల్యాణం ఇక ఎప్పుడెప్పుడా.. అని అందరూ ఎదురుచూ స్తుండగా అభిజిత్ లగ్నం రానే వచ్చి ంది. సరిగ్గా మధ్యాహ్నం 12 గంట లకు వేదపండితులు జగదభిరాముడు, సీతమ్మ శిరస్సులపై జీలకర్ర బెల్లం పెట్టారు. వేద మంత్రఘోష, కరతాళ ధ్వనులు మిన్నంటుతుండగా సీతమ్మకు మాంగళ్యధారణ జరిగింది.
వేడుకను కనులారా వీక్షించి భక్తులు పులకించారు. ఇలా ఆదివారం సీతారాముల కల్యా ణం కనుల పండువగా సాగింది. రాష్ట్ర ప్రభు త్వం తరఫున సీఎం రేవంత్‌రెడ్డి దంపతులు పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. అర్చకులు తెల్లవారుజామున 2 గంటలకు ఆలయాన్ని తెరిచారు. స్వామివారికి సుప్రభాత సేవ నిర్వహించారు. తిరు ఆరాధనతో పాటు మూలవరులకు అభిషే కం నిర్వహించారు.
ఉదయం 8 గంటలకు ధ్రువమూర్తుల కళ్యాణం నిర్వహించారు. కల్యాణ ముగిసిన తర్వాత కల్యా ణ మూర్తులకు అలంకరణ చేసి మిధిలా మండపానికి ఊరేగింపుగా తీసుకొచ్చారు. మిధిలా మైదానంలో కిక్కిరిసిన భక్తజనం సందోహం మ ధ్య ఉదయం 10.30 గంటలకు వేదమంత్రోచ్ఛరణల నడుమ కల్యాణ ఘట్టం నిర్వహిం చారు.
మొదట మేళతాళాలు, భక్తుల జయజయద్వానాల మద్య కల్యాణమూర్తులను ఊరేగింపుగా కల్యాణ వేదిక వద్దకు తీసుకొచ్చారు. అనంతరం స్వామివారికి ప్రభుత్వం తరఫున సీఎం రేవంత్‌రెడ్డి దంపతులు పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పిం చారు. 12 దర్బాలతో ప్రత్యేకంగా అల్లిన తాడును సీతమ్మవారి నడుముకు అలంకరించారు.
యోక్త్రధారణ చేయడం ద్వారా గర్భస్త దోషాలు తొలుగుతాయని చెపుతారు. సీతారాములకు రక్తబంధనం కట్టి, స్వామి గృహస్త ధర్మం కోసం యజోపవితరణ చేసి కన్యావరుణ నిర్వహించి తాంబూలాది సత్కారాలు అందిచారు. శ్రీరాముడికి సీత మ్మ తగిన వదువని పెద్దలు నిర్ణయించి ఇరువంశాల గోత్రాలు పఠించారు. స్వామివారి పాదప్రక్షాళన చేసి మహాదానాలు సమర్పించారు.
భక్త రామదాసు సమర్పించిన పచ్చల హారం సహపలు ఆభరణాలను స్వామి, అమ్మవారికి అలంకరించారు. లోకమంతా వేయికళ్లతో ఎదురుచూసిన సీతమ్మవారి మెడలో శ్రీరామచంద్రుడు మాంగళ్యధారణ చేశారు. లక్షలాది సంఖ్యలో తరలివచ్చిన భక్తుల రామనామస్మరణ మధ్య ఆ జగదభిరాముడు జానకమ్మను మనువాడాడు.
ఈ వేడుకలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, సీఎస్ శాంతి కుమా రి, ఎంపీలు చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, పోరిక బలరాంనాయక్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యేలు, దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామ య్యర్, కమిషనర్ శ్రీధర్ పాల్గొన్నారు. శ్రీరామనవమి సందర్భంగా కల్యాణ కాంతులతో కళకళలాడిన పురుషోత్తముడికి సోమవారం పుష్కర సామ్రాజ్య పట్టాభిషేక మహోత్సవం జరగనుంది. ఈ ఉత్సవానికి గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ హాజరుకానున్నారు.
నిర్ణీత సమయంకన్నా 50 నిమిషాలు ఆలస్యం
సీఎం రేవంత్‌రెడ్డి షెడ్యూల్ సమయానికన్నా 50 నిమిషాలు ఆలస్యంగా మిథిలా స్టేడియానికి చేరుకున్నారు. ఉదయం 11.40 గంటలకు రావాల్సిన సీఎం మధ్యాహ్నం 12.01 గంటలకు రాగలిగారు. 12.40 గంటలకు వేడుక పూర్తి కాగా, వెనువెంటనే అక్క డి నుంచి బయల్దేరారు.