24-02-2025 12:00:00 AM
బొప్పరాజు గంగన
“పరవిత్త, కళత్రంబుల
బరికింపక యపహరించు పాపాత్ముడు దు
ష్కర పాశబద్ధుడై యమ
పురుషుల చే నధిక బాధ బొందుచునుండున్”
అంటూ ‘భాగవతం’లోని పంచమ స్కంధంలో 28 విధాలైన నరకాలను గురించి వివరిస్తూ చెప్పి న ఈ పద్యం బొప్పరాజు గంగన రచించింది. భాగవత రచన చేసిన పోతన, ఏర్చూరి సింగన, వెలిగం దల నారయలతోపాటు ఉన్న మరొక కవి ఈ బొ ప్పరాజు గంగన.
పోతన్న ఒకటి నుంచి నాల్గవ స్కంధం వరకు రచించి, తిరిగి ఏడవ స్కంధం రా శాడు. అయితే, 5వ స్కంధం బొప్పరాజు గంగన, ఆరవ స్కంధం ఏర్చూరి సింగనలు రచించిన పిద ప మళ్లీ ఎనిమిది నుంచి పదవ స్కంధం పూర్వోత్తర భాగాలను పోతన రచిస్తే 11, 12 స్కంధాలు వెలిగందల నారయ్య రచించడంతో భాగవతం తెలుగు అనువాదం పూర్తయింది. ఈ విషయంలో ఆయా గ్రంథాలలో వివిధ సాహిత్య చరిత్రకారులు అనేక విధాలుగా చెప్పిన విషయం విదితమే.
తక్కువ కథలతో పంచమ స్కంధం
భగవంతుని, భగవద్భక్తుల కథలతో మానవునిలో భక్తిని, మానవీయ విలువలను బోధిస్తున్న ‘శ్రీమద్భాగవతం’లోని అన్ని స్కంధాల్లోనూ కథలే ఎక్కువ. కానీ, ఈ కవి విరచిత పంచమ స్కంధం లో మాత్రం కథలు తక్కువ, భూగోళ, ఖగోళాది శాస్త్ర విషయాలే ఎక్కువ. పంచమ స్కంధం ప్రత్యేకత ఇదే.
ఇక్కడ బొప్పరాజు గంగన సంస్కృతం లోని వేదవ్యాస మహాముని రచించిన మూలంలోని ఎన్నెన్నో విశేషాలనూ తాను అనువదించిన సందర్భంలో పూర్తిగా ఉపయోగించుకున్నాడు. ఈ కారణాలవల్ల కవిత్వ శక్తి ప్రదర్శనకు ఈ స్కంధం లో అవకాశం తక్కువే అని చెప్పాలి.
అందుకే, కవి త్వం విషయంలో పలువురు చరిత్రకారులు గంగనను అంతగా గుర్తించలేదు. కవితాత్మకత కూడా ఒక స్థాయిలో లేదన్న భావననే వారు వెలిబుచ్చారు.
బొప్పరాజు గంగన తనను గురించి కాని, తన కవితా శక్తిని గురించి కాని రచనలో భాగంగా చె ప్పుకోలేదు. చివరకు గద్యంలో కూడా కేవలం తాను బొప్పరాజు పుత్రుడననే చెప్పుకుంటూ,
“ఇది శ్రీ సకలసుకవిజనానందకర బొప్పనా
మాత్ర పుత్ర గంగనార్య ప్రణీతంబైన...”
అని మాత్రమే చెప్పుకొని ఈ స్కంధంలోని కథల పట్టికను వివరించారు. కనీసం తన గోత్రనామాన్ని కూడా చెప్పుకోలేదు. కనుక, గంగన వ్యక్తిగత వివరాలు సాహిత్య చరిత్రకారులకు ఎక్కువగా తెలి యరాలేదు. ఇందులోని కథల పట్టికను బట్టి ఈ స్కంధంలో ప్రియవ్రతుని చరిత్ర, ఋషభావతారం, జడభరతోపాఖ్యానం, భూగోళ నిర్ణ యం, ఖగోళ శాస్త్రం, నరక లోక వర్ణన వంటి అం శాలు ఉన్నట్లు స్కంధాంత గద్యం వల్ల తెలుస్తున్నది.
రెండు ఆశ్వాసాలుగా..
గంగన ఈ పంచమ స్కంధా న్ని రెండు ఆశ్వాసాలుగా విభజించడం విశేషం. ప్రథమాశ్వాసం లోని 185 గద్య పద్యాల్లో లెక్కకు 20 కథలున్నా అన్నీ ఒక్క రాజవంశ చరిత్ర గురించే కనిపిస్తుంది. ద్వితీయాశ్వాసంలో భూగోళ ఖగోళ విషయాలే ఎక్కువ. కథలు తక్కువే.
ఈ ఆశ్వాసాల్లో కవికి తన కావ్యకళా ప్రదర్శనను చూపడానికి కూడా అవకావం తక్కువే. అయినా, గంగన యథాశక్తి తన రచనా పటిమను చూపే ప్రయత్నం కొంతవరకైనా చేశాడు. కాకపోతే, సాహిత్యకారుల అభిప్రాయాలనుబట్టి భాగవత రచనా భాగ స్వాములైన మిగతా కవులకన్నా కొంత స్థాయి తక్కువేనని చెప్పవచ్చు. కీ.శే. కురుగంటి సీతారా మయ్య, ఆరుద్ర వంటివారు పలుచోట్ల కొన్ని ఆక్షేపణలు చే యడం ద్వారా ఈ నిర్ణయాన్ని వెలిబుచ్చారు.
ఈ స్కంధంలో అతిముఖ్యం గా చెప్పుకోవలసిన విషయం జడభరతోపాఖ్యానం. మన భార తదేశానికి, భారతవర్షానికి ఆ పేరు రావడానికి ఈ ‘భరతుడే’ కారణం. ఈయన పేరే మన దేశానికి రావడానికి మూలమన్న సంగతిని పూర్వులు చెప్పడాన్ని గమనించాలి.
చాలా సందర్భాల్లో ఇది దుష్యంతుని పుత్రుడైన భరతుని పేర వచ్చిందిగా వింటుంటాం. కానీ, అది సత్యం కాదు. ఒక ప్రాంతానికే శాశ్వతంగా పేరు రావడానికి కారణమైన ఈ మహనీయుని కథ ఇందులో విశేషించి చెప్పటం ఇక్కడ ప్రత్యేకత. దీనికి పూర్వరంగం వివరించడం లో ముఖ్యమైంది అగ్నీధ్రుని వృత్తాంతం. దాదాపుగా ఈ ఆశ్వాసం మొత్తం కథలతో సంబంధం ఉన్నదే అగ్నీధ్రుని వృత్తాంతం.
అగ్నీధ్రుని వృత్తాంతం
అగ్నీధ్రుని తపస్సుకు మెచ్చిన బ్రహ్మదేవుడు ఆయనకు బ్రహ్మ ప్రసాదంగా ‘పూర్వచిత్తి’ అనే పేరుగల అప్సరసను ఇచ్చాడు. అగ్నీధ్రుడు ఆమెతో
“తపంబు సేయుము, సంసారంబును
వృద్ధి పొంద సేయుము”
అని కోరడం, ఆమె అంగీకరించడం, వీరికి తొమ్మండుగురు సంతానం కలగడం, పెద్దవాడైన ‘నాభి’ విషయం మొదలైన వివరాలతోపాటు ఇందులోనే వాసుదేవుని వరం తరువాత ‘ఋషభావతార వృత్తాంతమూ’ చోటు చేసుకుంది. ఇతని పుత్రుని పేరే భరతుడు. ఇతడే ఋషభుని తరువాత రాజయ్యాడు.
ఈ సందర్భంలో అగ్నీధ్రుడు పూర్వచిత్తితో జరిపిన సంభాషణ, ప్రశ్నలు మొదలైనవి గంగన ప దు నాలుగు పద్యాల్లో అందించాడు. భరతుడు తపస్సుకు వెళ్లడం, తపోనిష్ఠుడై కాలం గడుపుతున్న సందర్భంలో ఒక జింకపిల్లను పెంచుకుని నిరంతరం దానినే గుర్తు చేసుకుంటున్న కారణంగా, మరణకాలంలో కూడా అదే స్మరణకు రావడంతో లేడిగానే ఈయన పునర్జన్మ పొందడం ఈ వృత్తాంతంలో పొందు పరిచాడు. ఈ వృత్తాంతంలో లేడిపై భరతుని అనుబంధాన్ని గంగన గొప్పగా చెప్పాడు.
“గురువులు వారి బిట్టురికి
కొమ్ముజిమ్ముచు నంతనంత ద
గ్గరుచును గాలు ద్రువ్వుచు, నఖంబులు
గీరుచు, గాసిసేయుచు
న్నొరుగుచు ధారుణీశ్వరుని
యూరువులన్ శయనించి యంతలో
నరకడ మెక్కుచుం బొదలి యాడుచు
నాహరిణంబు లీలలన్”
అంటూ ఆ జింక చేష్టలు మనిషిని తన్మయుణ్ణి చేసే విధంగా వర్ణించాడు. ఎంతో ప్రేమగా పెంచుకున్న భరతుడు దానిపై అమితమైన మమకారం పెంచుకోవడం అత్యంత సహజం. ఇంతటి ప్రాపంచిక బంధం పెంచుకున్న వ్యక్తికి పునర్జన్మ తప్పదని ఈ వృత్తాంతం బోధిస్తున్నది.
అంతేగాక, ముక్త భావన కలిగిన వారు, కైవల్య పదం వాంఛించే వారు ఇటువంటి బంధాలన్నీ తెంచుకోవాలన్న సందే శం కూడా ఈ వృత్తాంతం భంగ్యంతరంగా చెబుతున్నది. జన్మరాహి త్యం కోరుకునే వారికి ఇది గొప్ప మార్గాన్ని చూపిస్తున్నది. ప్రాపంచిక సంబంధం వల్లే భరతుడు పునర్జన్మ పొందాడు. ఇటువంటి అనేక విషయాలు ఈ స్కంధంలోని ప్రథమా శ్వాసంలో దర్శనమిస్తాయి.
అన్నీ శాస్త్రీయ విశేషాలే
ద్వితీయాశ్వాసంలో దాదాపు అన్నీ శాస్త్ర విషయాలే ఉన్నాయి. ద్వీపాలు, వర్షాలు, పర్వతాలు, సముద్రాలు, నదులు మొదలైన భూగోళ విశేషాలను గంగన వివరించాడు. అదే విధంగా నవ గ్రహాలు, వాటి స్థితిగతులు, పరిమాణాలు, గ్రహాల మధ్య దూరాలు, శింశుమార చక్రం మొదలైన ఖగోళాంశాలతోపాటు చంద్రగ్రహం శీఘ్ర గామి త్వం, శనిగ్రహం మంద గామిత్వం మొదలైనవి ఉన్నాయి. వీటితోపాటు ప్రతి రాశిలో సూర్యుడు ఒక్కో నెల ఉండడం మొదలైనవన్నీ విశేషాలన్నీ విపులంగా వివరించడంతో ఈ ఆశ్వాసం సుసంపన్నమైంది.
వీటిని చూస్తుంటే మన పురాణాలు ఆదిమ విజ్ఞాన సర్వస్వాలేమో అనిపిస్తుందన్న ఆరుద్ర మాటలు అక్షర సత్యాలే. అందుకే, చాలా పురాణాలు సూర్య గమనం లెక్కలు చెప్పడం, కాశీఖం డం వంటి గ్రంథాలు సూర్యరథ వేగాన్ని లెక్కగట్టి చెప్పడం వంటివే ఈ అభిప్రాయానికి ప్రమాణాలు. శాస్త్ర విషయాలు భాగవతంలో నిక్షిప్తమైన భాగాన్ని బొప్పరాజు గంగన సమర్థంగా తెలుగులో రచించి తెలుగు లోకాన్ని శాస్త్రీయ స్పృహ తో సంభావించాడు.
జైన సంస్కృతి ప్రభావం
ఈ బొప్పరాజు గంగన రచనా భాగంపై కొంత జైన సంస్కృతి ప్రభావం ఉందేమోనని కొందరు విద్వాంసులు భావించారు. వారు దానికి కారణాలను కూడా వివరిస్తూ, “జైన తీర్థంకరుల్లో కని పించే ఋషభనాభుడే ఈ భాగవతంలోని ఋషభనాథుడు కావచ్చు” అని అన్నారు.
ఈ వృత్తాం తాల్లో కనిపించే యజ్ఞ సంస్కృతి తిరస్కరణ, అశ్వమేధాది క్రతువులపట్ల అసంతృప్తి, వైము ఖ్యం, ఉన్మత్తకారుడై, దిగంబరంగా ఈ జడభరతుడు అరణ్యాల్లో సంచరించడం వంటి చాలా సందర్భాలను పరిశీలిస్తే ఇది “జైన పురాణ గాథలే వైష్ణవత్వపు రంగు పూసుకున్నాయేమో”
అన్న విమర్శకుల మాటలు యథార్థాలుగా అనిపిస్తాయి. ఏల్చూరి వారు పేర్కొన్నట్లు, “గంభీరమైన తత్తార్థ బోధకత వల్ల, తిరుగులేని కవితా రామణీయకం మూలాన రసోదించితమని పేరెన్నిక గన్నది ఈ పంచమ స్కంధం” అన్న మాటలు ప్రత్యక్ష సత్యాలు.