02-04-2025 06:47:27 PM
జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే..
కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): మహనీయులు దేశానికి అందించిన సేవలు భావితరాలకు తెలిసే విధంగా మహనీయుల జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. బుధవారం కలెక్టరేట్ లో షెడ్యూల్డ్ కులాల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి జిల్లా అదనపు కలెక్టర్ డేవిడ్ తో కలిసి హాజరై మహనీయుల జయంతి వేడుకల నిర్వహణపై అధికారులు, నిర్వహణ కమిటీ సభ్యులు, అంబేద్కర్ యువజన సంఘాల ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ... ఈ నెల 5న బాబు జగ్జీవన్ రామ్ జయంతి, 14న బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలను జిల్లాలో ఘనంగా నిర్వహించాలని తెలిపారు.
ఇందులో భాగంగా మహనీయుల జయంతి రోజున విగ్రహాల అలంకరణ, వేదికల ఏర్పాట్లు చేయాలని, గ్రామాలలో, మండల కేంద్రాలలో, జిల్లా కేంద్రంలో ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని తెలిపారు. ఆసిఫాబాద్, కాగజ్ నగర్ మున్సిపాలిటీలకు జిల్లా అదనపు కలెక్టర్ డేవిడ్ ప్రత్యేక అధికారిగా వ్యవహరిస్తారని, అధికారి సమన్వయంతో వేడుకలు ఘనంగా నిర్వహించాలని తెలిపారు. బాబు జగ్జీవన్ రామ్ విగ్రహ ఆవిష్కరణకు చర్యలు చేపట్టాలని, జిల్లా కేంద్రంలో అంబేద్కర్ భవనం కొరకు అవసరమైన స్థలం ఎంపిక చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి సజీవన్, నాయకులు సుభాష్, తుకారాం, అశోక్, చరణ్ దాస్, కేశవరావు, డోంగ్రే సునీల్, కుడుక శ్రీనివాస్, జోడే శివరాం, దుర్గం సూరజ్, చునార్కర్ లింగయ్య, యువజన సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.